Thursday, January 23, 2025

భక్తుల కోసం జలమండలి తాగునీటి శిబిరాలు

- Advertisement -
- Advertisement -

నీటి నాణ్యతను తనిఖీ చేసిన ఎండి దానకిశోర్

మన తెలంగాణ/ హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా జలమండలి ఏర్పాటు చేసిన తాగు నీటి శిబిరాలను ఎండి దాన కిశోర్ గురువారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో ఉన్న శిబిరాలకు వెళ్లిన ఆయన అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. నీటి నాణ్యత, క్లోరిన్ పరీక్షల వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏటా వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఉచితంగా తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే మరింత తాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్లోరిన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారుల్ని ఆదేశించారు. శోభాయాత్ర, ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ఎక్కడా నీటి లీకేజీలు, సీవరెజి ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు నిర్వహణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన శిబిరాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేసి… ఎండీ దాన కిశోర్, జలమండలి అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

గణేష్ భక్తుల కోసం జలమండలి తాగునీటి ఏర్పాట్లు
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేసింది. దీంతోపాటు నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు సైతం నిర్వహిస్తోంది. గణేష్ శోభాయాత్ర, ఊరేగింపు జరిగే ప్రాంతాలు, దారులతో పాటు ట్యాంక్ బండ్, డా.బీఆర్. అంబేడ్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వీటిల్లో మొత్తం 33.50 లక్షల వాటర్ ప్యాకెట్లు, అవసరమైన చోట్ల డ్రమ్ముల్లోనూ మంచినీరు అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. 24 గంటలూ సేవలందించేందుకు 3 షిఫ్టుల్లో సిబ్బందిని నియమించింది. ఈ శిబిరాల్లో నీటి నాణ్యతను క్యూఏటీ బృందాలు ఎప్పటికప్పుడు పరీక్షించడంతో పాటు క్లోరిన్ శాతం తగిన మోతాదులో ఉండేలా చర్యలు చేపట్టింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లో రెండు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ, ఇతర సమస్యలు పరిష్కారానికి నోడల్ అధికారులు సైతం నియమించింది. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News