Thursday, January 23, 2025

జమా మసీదులోకి యువతులపై నిషేధం

- Advertisement -
- Advertisement -

జమా మసీదులోకి యువతులపై నిషేధం
నోటీసుతో ఉత్తర్వులు …తీవ్రస్థాయి నిరసనలు
లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం.. మహిళా సంఘాల హెచ్చరికలు
ఆదేశాల వాపసీకి షామీ ఇమామ్ అంగీకారం?
ఫ్యాషన్లకు వచ్చేవారిపై ఆంక్షలు
ప్రార్థనలకు దిగేవారిపై కాదని వివరణ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మసీదులోకి అమ్మాయిలకు అనుమతి లేదని అక్కడి కార్యనిర్వాహక అధికార యంత్రాంగం తెలిపింది. గురువారం ఈ మేరకు ప్రధాన ద్వారం వెలుపల నోటీసులు అతికించి ఉంచారు. దీనితో నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకులు కంగుతిన్నారు. బాలికలు, యువతులు ఒంటరిగా కానీ గుంపుగా కానీ ఇక్కడికి రావడానికి వీల్లేదని ఈ నోటీసులలో తెలియచేయడంతో వివాదం తలెత్తింది.

కొద్దిసేపటి తరువాత జమా మసీదు షాహీ ఇమామ్ ఓ ప్రకటన వెలువరించారు. నమాజులకు, ఇతరత్రా దైవిక చింతనలకు వచ్చే వారికి అనుమతి ఉంటుందని, నిషేధం కేవలం విహార యాత్రల తరహాలో ఇక్కడికి వచ్చే యువతులకు వర్తిస్తుందని షాహీ ఇమామ్ ప్రకటించారు. జమా మసీదు ఇరాన్‌లో, అఫ్ఘనిస్థాన్‌లో ఉందా? ఈ విధమైన నిషేధానికి ఏ విధంగా దిగుతారని పలువురు నిలదీశారు. మహిళా హక్కుల సంఘాల కార్యకర్తలు నిరసనలకు దిగారు. మసీదు నిర్వాహకుల నిర్ణయం తిరోగమన చర్య అని, ఆమోదయోగ్యం కాదని నిరసనకారులు తెలిపారు. జమా మసీదు వెలుపల వెలిసిన పత్రాలపై ఎటువంటి తేదీని ప్రస్తావించలేదు.

అయితే బాలికలకు ప్రవేశం లేదని ఇది మసీదు ఫర్మానా అని తెలిపారు. దీనితో 17వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన కట్టడానికి రోజూ వేలాది మంది పర్యాటకులు కంగుతిన్నారు. ఇప్పటి నోటీసు మహిళా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని, దీనిని ఆమోదించేది లేదని ఢిల్లీ మహిళా కమిషన్ అధినేత్రి స్వాతి మాలీవాల్ స్పష్టం చేశారు. ఈ నోటీసుకు ప్రతిగా తాము ఈ మసీదుకు ప్రతినోటీసు పంపిస్తామని తెలిపారు. తమంతతాముగా స్పందించి ఈ విషయంపై చర్యకు దిగుతామని స్పష్టం చేశారు. అయితే ఆ తరువాత ఈ నిషేధ నిర్ణయం గురించి షాహీ ఇమామ్ వివరణ ఇచ్చుకున్నారు.

ఇది పవిత్ర ప్రార్థనా స్థలం అని, అయితే ఈ చారిత్రక స్థలంలో కొన్ని ఘటనలు జరగడంతో అన్ని విషయాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఈ నిషేధం ప్రార్ధనలకు వచ్చే, పవిత్రతతో కట్టుబడి వారికి వర్తించబోదని తెలిపారు. మరో వైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం ఈ నిషేధం అంశంపై షామీ ఇమామ్‌తో మాట్లాడారు. దీని వల్ల తలెత్తే పరిణామాలను సమీక్షించాలని సూచించారు. ఆ తరువాత కొద్ది సేపటికి మహిళ ల ప్రవేశంపై నియంత్రణల డిక్రీ ఆదేశాలను ఉపసంహరించుకునేందుకు జమా మసీదు షాహీ ఇమామ్ అంగీకరించారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం రాజ్‌నివాస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

Jama Masjid ban on Women’s Entry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News