Sunday, December 22, 2024

ఆ మసీదులో స్త్రీపురుషులు కలిసి కూర్చోకూడదు !

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: చారిత్రాత్మక జామియా మసీదు ఆరు బయట పచ్చిక బయళ్లలో స్త్రీపురుషులు కలిసి కూర్చోరాదని, మసీదులో ఫోటోలు తీయకూడదని నిషేధం విధించింది. ఫోటోగ్రఫీ పరికరాలతో మసీదులోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించింది. ఈ విషయాన్ని ‘అంజుమన్ ఔఖుఆఫ్ సెంట్రల్ జామియా మసీదు’ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆ ప్రకటనను మసీదు భవన సముదాయంలో అతికించింది.

మసీదు ప్రాంగణంలోకి ఆహార పదార్థాలు తీసుకురావొద్దని నిషేధించింది. ఎవరైనా పొరపాటున తెస్తే వారిని గేట్ వద్దనే ఆపేయడం జరుగుతుంది అని ప్రకటనలో పేర్కొంది. 14వ శతాబ్దికి చెందిన ఆ మసీదు మేనేజ్‌మెంట్ అక్కడి సెక్యూరిటీ గార్డులకు ఈ విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. మసీదుకొచ్చే మహిళలకు వారికి కేటాయించిన ప్రత్యేక ప్రదేశంలోనే కూర్చోవాలని, పురుషులకు వేరుగా ఉండాలని పేర్కొంది. ప్రార్థనా స్థలంలో పవిత్రతను కాపాడాలని కూడా సూచించింది.

“ఇదేమి పబ్లిక్ పార్క్ లేక రిక్రియేషన్ స్థలమో కాదు. స్థానికులైనా, బయటి వారైనా ఫోటోలు తీయకూడదు. ఆ విషయాన్ని వారు మనస్సులో పెట్టుకోవాలి. ఎవరైనా వృత్తిరీత్యా ఫోటోలు, వీడియోలు తీయాలనుకుంటే వారు అంజుమన్ ఔఖుఆఫ్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది” అని తన ప్రకటనలో మేనేజ్‌మెంట్ పేర్కొంది. మసీదులో ప్రార్థన చేసుకోడానికి వచ్చే స్త్రీ పురుషులు వేర్వేరుగానే ఉండాలని, వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే ప్రార్థనలు చేయాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News