రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ
మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ అనంతరం జెపిసికి బిల్లు ప్రతిపాదన
లోక్‌సభ, శాసనసభలకు ఏకకాల ఎన్నికల వరకే ప్రస్తుతానికి పరిమితం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రా జ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. బిల్లును ఉభయ సభల సంయుక్త క మిటీకి నివేదించవచ్చు. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’పై బిల్లుగా పే ర్కొంటున్న రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును కేంద్ర న్యా య శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టవచ్చున ని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు తెలియజేశారు. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత మేఘ్వాల్ విస్తృత సంప్రదింపుల నిమిత్తం పార్లమెంట్ సంయుక్త కమిటీకి బిల్లును నివేదించవలసిందిగా లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు విజ్ఞప్తి చేస్తారు. వి విధ పార్టీల ఎంపిల సంఖ్య ఆధారంగా దామాషా పద్ధతిపై సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తారు. అతి పెద్ద పార్టీగా బిజె పి పలువురు సభ్యులతో పాటు కమిటీ అధ్యక్ష పదవిని పొం దుతుందని ఆ అధికారి తెలిపారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా ఒకేసారి నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీలో
సభ్యుడైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బిల్లు ప్రతిపాదన సమయంలో దిగువ సభకు హాజరు కావచ్చునని సదరు అధికారి సూచించారు.
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని క్రితం వారం నిర్ణయించిన కేంద్ర మంత్రివర్గం స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ అంశాన్ని ‘ప్రస్తుతానికి’ వదలివేయాలని అనుకున్నది. బిల్లుపై శాసనకర్తలు, ప్రజలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపవలసిన అవసరం ఉన్నందున దానిని సంయుక్త కమిటీకి నివేదించాలని దిగువ సభకు మేఘ్వాల్ సూచించవచ్చు. స్పీకర్ అదే రోజు ప్రతిపాదిత కమిటీ కోసం సభ్యుల పేర్లను పార్టీల నుంచి కోరతారు. కమిటీ కోసం తాము పంపాలని అభిలషిస్తున్న సభ్యుల గురించి స్పీకర్‌కు పార్టీలు తెలియజేయకపోతే, నిబంధనల ప్రకారం అవి సభ్యత్వం కోల్పోవచ్చు. బిల్లును ప్రవేశపెట్టిన రోజు సాయంత్రానికల్లా కమిటీ కూర్పును స్పీకర్ ప్రకటిస్తారని సదరు అధికారి చెప్పారు. ఆదిలో ప్రతిపాదిత కమిటీ కాలపరిమితి 90 రోజులు ఉంటుంది. కానీ, ఆ వ్యవధిని తరువాత పొడిగించవచ్చు. పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రెండు బిల్లులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశంలో జమిలి ఎన్నికలను 1951, 1967 మధ్య నిర్వహించారు.