అగర్ మాళ్వా (ఎంపి) : ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ (ఒఎన్‌ఒఇ జమిలి ఎన్నికలు) బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదముద్ర పొందుతాయన్నది తనకు అనుమానమే అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. మధ్య ప్రదేశ్ అగర్ మాళ్వా జిల్లాలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో బిజెపి ఎంపిలను ‘నెట్టివేశారు, తోసివేశారు’ అంటూ లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను జెపిసికి లోక్‌సభ శుక్రవారం నివేదించిన విషయం విదితమే.
జమిలి ఎన్నికలపై ప్రశ్నకు దిగ్విజయ్ సమాధానం ఇస్తూ, ‘జెపిసి ఏర్పాటైంది. అది ఆమోదం పొందుతుందని నేను భావించడం లేదు’ అని చెప్పారు. బిజెపి ఫిర్యాదుతో రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బిజెపి ఎంపిలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్‌పుత్ గాయపడిన తరువాత రాహుల్ దౌర్జన్యం, రెచ్చగొట్టడం అందుకు కారణమని బిజెపి ఆరోపించింది. ఆ ఆరోపణను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బిజెపి ఎంపిలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను నెట్టివేశారని, రాహుల్‌పై ‘భౌతిక దాడి జరిపార’ని కాంగ్రెస్ ఆరోపించింది.
కాగా, రాహుల్‌పై ఆరోపణల గురించి విలేకరులు ప్రశ్నించగా, వాటిని పూర్తిగా తప్పుడువని దిగ్విజయ్ సింగ్ సమాధానం ఇచ్చారు. ‘అది పూర్తిగా తప్పు. బిజెపి నాయకుల మధ్య తోపులాటలు, నెట్టివేసుకోవడాలు జరిగాయి’ అని దిగ్విజయ్ వాదించారు. ‘ఒక బిజెపి ఎంపి మరొకరిపై పడ్డారు. ఇద్దరూ గాయపడ్డారు. తన ముందు రాహుల్ గాంధీ ఉన్నారని కింద పడిన ఎంపి చెప్పారు. ఆయన ముందు నిల్చుని ఉంటే అతనిని నెట్టివేయగలరా?’ అని దిగ్విజయ్ అన్నారు.