ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్రమైన జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కావని ఆయన ప్రభుత్వమే అంగీకరించక తప్పలేదు. ఒకే జాతి, ఒకే ఎన్నిక అంటూ ఆయన ఎంతగా ఊదరగొట్టి వదిలిపెట్టారో తెలిసిందే. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎందరు ఎంత మొత్తుకొన్నా ఆయన చెవిన పెట్టలేదు. 2020 నవంబర్ 26న జరిగిన అఖిల భారత సభాధ్యక్షుల సమావేశంలోనూ ప్రధాని ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించారు. లోక్‌సభకు, విధాన సభకు, స్థానిక పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని ఉద్ఘాటించారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ విషయమై సభ్యులొకరు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో గురువారం నాడు సమాధానమిస్తూ ఏక కాల ఎన్నికల నిర్వహణకు అనేక అడ్డంకులున్నాయని, వాటిని దాటడం కష్టసాధ్యమని స్పష్టం చేశారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల నియమావళి అమలు చేయాల్సి వస్తుందని, అది అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిలిపివేస్తుందని, దాని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందనేది వాస్తవమే. ఈ సమస్యను తొలగించడం కోసం ఉప ఎన్నికలు సహా లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనడం సరికాదని రాజ్యాంగ నిపుణులు గతంలో హెచ్చరించి వున్నారు. ఎందుకంటే శాసన సభలలో అధికార పక్షాలు ఐదేళ్ళు అధికారంలో వుండే అవకాశాలు తక్కువ. ఫిరాయింపుల వల్ల అవి మెజారిటీ కోల్పోయి కూలిపోయే అవకాశాలున్నాయి. ఏ ఒక్క పార్టీ తగిన మెజారిటీతో ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం లేనప్పుడు కొద్ది కాలం రాష్ట్రపతి పాలన విధించినా, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అవుతుంది. అంతేకాదు ఒక్కో రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ఒక్కోసారి ముగింపుకి చేరుకొంటుంది.
అటువంటప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కొనసాగించడం ప్రజాస్వామిక ప్రక్రియను తీవ్రంగా దెబ్బ తీస్తుంది. సుదీర్ఘ కాలం ప్రజల తీర్పు లేకుండా అధికారుల పాలన సాగడం ప్రజాస్వామ్య విరుద్ధం, ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేకం కూడా అన్నది సుస్పష్టం. ఈ కోణాన్ని బొత్తిగా పట్టించుకోకుండా ప్రధాని మోడీ కొంత కాలం క్రితం చీటికి, మాటికి జమిలి ఎన్నికల మంత్రం పఠించేవారు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు జరిపించాలంటే ఐదుకి తక్కువ గాని రాజ్యాంగ సవరణలు తీసుకు రావలసి వుంటుందని, అదనపు ఇవిఎంలను, పేపర్ ట్రయల్ మెషిన్లను కొనుగోలు చేయక తప్పదని, ఇందుకోసం వేల కోట్లలో డబ్బు అవసరమవుతుందని అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభకు తెలియజేశారు.
ఈ కష్టనష్టాల కోణాన్ని గమనించిన తర్వాతనే ప్రధాని మోడీ గత కొంత కాలంగా జమిలి ఎన్నికల ప్రస్తావన మానుకొన్నారని అనుకోవలసి వుంది. దీనితోపాటు అధ్యక్ష తరహా పాలన మీద కూడా ప్రధాని మోడీకి మక్కువ వున్నట్టు వార్తలు వచ్చాయి. ఎలాగైనా తామే ఎల్లకాలం అధికారంలో కొనసాగాలనేది ఆయన ఆంతర్యంగా బోధపడుతున్నది. అది ప్రజాస్వామ్యంలో బొత్తిగా జరిగే పని కాదు. అందుచేత కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల విషయంలో సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించి అవి ఆచరణ సులభం కావని తేల్చి చెప్పడం హర్షించవలసిన పరిణామం.అప్పటికీ ఆ ఆలోచనను విరమించుకొన్నామని మాత్రం కేంద్ర మంత్రి ప్రకటించ లేదు. మరింత పరిశీలన కోసం ఈ విషయాన్ని లా కమిషన్‌కు నివేదించామని, జమిలి ఎన్నికలకు ఆచరణీయమైన దారి పటాన్ని సిద్ధం చేయాలని కోరామని ఆయన ప్రకటించారు.
అది ప్రస్తుతానికైతే అయ్యే పని కాదని బోధపడుతున్నది. రాజ్యాంగం 83వ ఆర్టికల్ రాజ్యసభ పూర్తిగా రద్దు కావడమనేది లేకుండా చూస్తుంది. రాజ్యాంగం 85వ అధికరణ పార్లమెంటును సమావేశపరచడం, సమావేశాలను ముగించడానికి సంబంధించినది. ఏడాదిలో కనీసం రెండు సార్లు అయినా పార్లమెంటును సమావేశపరచాలని ఈ అధికరణ చెబుతున్నది. అంటే ప్రతి రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు మాసాలకు మించరాదు. ఆర్టికల్ 172 ఎమెర్జెన్సీ పొడిగింపుకి సంబంధించినది. ఆర్టికల్ 175 రాష్ట్ర శాసన సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం, వాటికి సందేశాలను పంపించడాన్ని నిర్దేశిస్తున్నది.
356వ అధికరణ రాష్ట్రాల్లో కల్లోల పరిస్థితులు ఏర్పడి వాటిని అంతమొందించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనప్పుడు కేంద్రం కలుగజేసుకొని అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి తగిన చర్యలు తీసుకొనే అధికారాలను కట్టబెడుతున్నది. అంటే ఇప్పుడు మణిపూర్‌లో తలెత్తిన మాదిరి పరిస్థితుల్లో కేంద్రానికి రాష్ట్రాలపై సర్వాధికారాలను ఈ అధికరణ ప్రసాదిస్తున్నది. ఈ అన్ని అధికరణలనూ తగు రీతిలో సవరిస్తే గాని ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటపడిన జమిలి ఎన్నికలు సాధ్యం కావని కేంద్ర ప్రభుత్వమే లోక్‌సభకు తెలియజేసింది. అందుచేత దేశాధినేత తొందరపడి ఇటువంటి ప్రతిపాదనలు చేయకపోడమే మంచిది.