Wednesday, January 22, 2025

2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్‌సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో 2029నుంచి లోక్‌సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఓ ఫార్ములాను లా కమిషన్ రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల శాసన సపభలు కాలపరిమితిని కుదించడం, లేదా పెంచడం ద్వారా ఒకే సారి ఎన్నికల నిర్వహణకు సిఫార్సులు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఉమ్మడి ఎన్నికల జాబితా ఉండేలా చూడడానికి లా కమిషన్ ఓ యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఒకే రకమైన పనిని కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఖర్చుతో పాటుగా సిబ్బంది వినియోగం లాంటివి ఎక్కువ అవసరం అవుతున్నాయి. ఒకే ఓటరు జాబితాను రూపొందించడం వల్ల ఖర్చుతో పాటు సిబ్బంది వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ విషయాలు బయటికి వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కానందున దీనిపై లా కమిషన్ తుది నివేదికను సిద్ధంచేయలేదని తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చని లా కమిషన్ భావిస్తోందని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి ఉన్న మార్గాలను అన్వేషించడం ప్రస్తుత లా కమిషన్ విధి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇటీవలే తొలి సమావేశం నిర్వహించిన ఈ కమిటీ.. దేశంలో పంచాయతీలనుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ దృష్టా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడాన్ని చేరుస్తూ లా కమిషన్ పరిధిని కూడా విస్తృత పరిచే అవకాశంలేకపోలేదదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో రెండు దశల్లో మూడంచెల ఎన్నికలను నిర్వహించవచ్చనే సూచనను లా కమిషన్ చేయవచ్చని తెలుస్తోంది.

మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు, రెండో దశలో స్థానిక సంసల ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ సూచించవచ్చని తెలుస్తోంది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన వాతావరణ పరిస్థితులు ఉన్న దృష్టా ఇది ఆచరణీయమైన వైఖరిగా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.ఇదిలా ఉంటే, ఏకకాల ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని లా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రుతురాజ్ అవస్థి ఇటీవల పేర్కొన్నారు. ఈ అంశంపై నివేదిక సమర్పణకు తుది గడువు అంటూ ఏమీ లేదన్నారు. పోక్సోచట్టం, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలను న్యాయశాఖకు పంపించినట్లు వెల్లడించిన ఆయన.. జమిలి ఎన్నికలపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోందని తెలిపారు. దీనిపై తుది నివేదిక సిద్ధం కాలేదని చెప్పారు.

దశలవారీగా ఇఎఫ్‌ఐఆర్
మరో వైపు దేశవ్యాప్తంగా ఇఎఫ్‌ఐఆర్‌ల నమోదును దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది.తొలి దశలో మూడేళ్ల వరకు శిక్ష పడే నేరాలకు సంబంధించిన కేసుల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకు రావాలని సూచించింది. ఇఎఫ్‌ఐఆర్ నమోదుకు కేంద్రీకృత జాతీయపోర్టల్‌ను ఏర్పాటు చేయాలని లా కమిషన్ ప్రతిపాదించింది. దీనివల్ల కేసుల నమోదులో ఆలస్యం ఉండదని, నేరం జగిన వెంటనే పౌరులు ఫిర్యాదులు చేసేందుకు వీలుంటుందని కమిషన్ అభిప్రాయపడింది.
స్వలింగ వివాహాలకు యుసిసి వద్దు
అటు ఉమ్మడి పౌరస్మృతిపైనా లా కమిషన్ తన నివేదికను సమర్పించింది. అయితే ఇందులో స్వలింగ వివాహాలను మినహాయించినట్లు తెలుస్తోంది.ఉమ్మడి పౌరస్మృతి మతంపై ఆధారపడకుండా దేశపౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక తదితర అంశాల్లో వివిధ మతాలకు ండే ‘ పర్సనల్ లా’లు అన్నీ ఈ చట్టంతో ఒకే ఉమ్మడి పౌరస్మృతి కిందికి వస్తాయి. అయితే స్వలింగ వివాహాలు ఉమ్మడి పౌరస్మృతి కిందికి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News