Monday, December 23, 2024

జమిలి కమిటీ తొలి భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యపు జమిలి ఎన్నికల కమిటీ శనివారం సమావేశం అయింది. కమిటీకి ఇది తొలి భేటీ అయింది. దేశమంతటా ఒకేసారి అసెంబ్లీలకు, లోక్‌సభకు కలిపి ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలనకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ తరహా ఎన్నికల ప్రక్రియపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, లా కమిషన్ అభిప్రాయం తెలుసుకోవాలని, ఇందుకు ఆహ్వానం పంపించాలని కమిటీ తొలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శనివారం నాటి భేటీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ , గులామ్ నబీ ఆజాద్, ఫైన్సాన్ కమిషన్ మాజీ అధ్యక్షులు ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కాశ్యప్ , మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలు విషయాల పరిశీలన తరువాత కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది.

ఎన్నికల ప్రక్రియ విషయం కాబట్టి సంబంధిత భాగస్వామ్య పక్షాలను ముందుగా సంప్రదించాల్సి ఉంది. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీల నేతలు లేదా ప్రతినిధులు, లా కమిషన్ ఉన్నతాధికారులను ఆహ్వానించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని సంకల్పించారు. దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు పిలుపు అందిస్తారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు , పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలకు ఆహ్వానాలు పంపించి జమిలి ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల చట్టాల మార్పు కీలకమవుతుంది కాబట్టి, లా కమిషన్ నుంచి సూచనలు స్వీకరిస్తారు. కాగా కమిటీలో సభ్యులు , ప్రముఖ లాయర్ హరీష్ సాల్వే వర్చువల్‌గా మీటింగ్‌లో పాల్గొన్నారు. కమిటీలో సభ్యుడిగా నియమితులు అయ్యి , ఇంకా అంగీకారం తెలుపని అధీర్ రంజన్ చౌధురి ( కాంగ్రెస్ నేత) సమావేశానికి హాజరు కాలేదు. తాను కమిటిలో చేరడం లేదని ఇప్పటికే అధీర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News