న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధాలను పరిశీలించేందుకు కేంద్రం కమిటీని నియమించింది. దీనికి తోడు ఈ నెల 18నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ప్రకటించిన నేపథ్యంలో ‘ ఒకే దేశం ఒకే ఎన్నిక ’ బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం బిజెపి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ లోక్‌సభతో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే ఇలా ఒకే సారి ఎన్నికలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు దేశాలు బెల్జియం, స్వీడన్, క్షిణాఫ్రికా మాత్రమే.
జమిలి ఎన్నికలపై పార్లమెంటు కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ స్థానికస్థానాల్లో అయిదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్‌లో కూడా ప్రతి నాలుగేళ్లకో సారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్(రిక్స్‌డాగ్),ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్‌స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ నెల రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఇక బెల్జియంలో ఫెడరల్ పార్లమెంటుకు ప్రతి అయిదేళ్లకో సారి యూరోపియన్ ఎన్నికల తరహాలో ఎన్నికలు జరుగుతాయి.
నేపాల్‌లో ఒక సారి..
ఇక మన పొరుగుదేశమైన నేపాల్‌లో కూడా 2017లో జాతీయ, రాష్ట్రస్థాయి ఎన్నికలు ఒకే సారి నిర్వహించిన అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా ఒకే సారి పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలని 2017 ఆగస్టు 21న నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. 2015లో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత నేపాల్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. అయితే దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరపడంలో ఎదురయ్యే ఇబ్బందులపై నేపాల్ ఎన్నికల కమిషన్‌ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం కొంత విరామంతో రెండు దశల్లో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా మొదటి దశ 2017 నవంబర్ 26న జరగ్గా , రెండో దశ ఎన్నికలు అదే ఏడాది డిసెంబర్ 7న జరిగాయి.