మూడో దఫా అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ దఫా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం అమలుకు కంకణం కట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. పదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవకాశం వచ్చినప్పుడల్లా జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. అయితే గత రెండు దఫాలుగా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినా, జమిలిపై దూకుడుగానే ఉండటం గమనార్హం. గత నెలలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి చెప్పినవన్నీ అక్షర సత్యాలే.
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోంది. దీని నుంచి బయటపడాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానమే శరణ్యమన్న ప్రధాని అభిప్రాయం వాస్తవమే అయినా, అమలులో ఎంతవరకూ సాధ్యమవుతుందన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్న. పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఉదాహరణకు 2009 లోక్‌సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు పది వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి రూ. 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే, మొత్తం 28 రాష్ట్రాలకు ఎంత అవుతుందో లెక్క కడితే గుండెలు బేజారవకమానదు.
కేవలం ఖర్చు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఏడాది పొడుగునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉండటం వల్ల ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు విఘాతం కలుగుతోందన్న వాదనను కూడా తోసిపుచ్చలేం. జమిలి ఎన్నికల వల్ల ఓటర్లకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనివల్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మన దేశంలో జమిలి ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. 1951లో తొలిసారి సాధారణ ఎన్నికలు ఈ తరహాలోనే జరిగాయి. ఆ తరువాత 1967 వరకూ మూడు దఫాలు ఇదే తరహాలో ఎన్నికలు జరిగినా, 1970లో కాలపరిమితి ముగియకుండానే లోక్‌సభ రద్దు కావడంతో జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది.
అప్పటినుంచీ అడపాదడపా ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశం తెరపైకి వస్తున్నా, మోడీ నేతృత్వంలో ఎన్‌డిఎ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక, దీనిపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన కమిటీ కూడా జమిలి ఎన్నికలకు జై కొట్టింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించిన వంద రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ అంత తేలిగ్గా అమలులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు రాజ్యాంగ సవరణలు అవసరం. ఇందుకు రాష్ట్రప్రభుత్వాల అనుమతి ఆవశ్యకం. జమిలి బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో చెరో 67 శాతం మంది సభ్యులు ఆమోద ముద్ర వేయాలి. అలాగే సగం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సై అనవలసి ఉంటుంది.
లోక్‌సభలో ఎన్‌డిఎకు ఉన్న బలం 61 శాతం. రాజ్యసభలో అయితే అది కేవలం 38 శాతమే. అదలా ఉంచితే కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు విముఖత చూపించే అవకాశం ఉంది. ఒకేసారి లోక్‌సభకు, శాసనసభకు ఎన్నిక జరిగితే ప్రజలు ఏదో ఒక పార్టీకి లేదా కూటమికే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయన్నది ప్రాంతీయ పార్టీల భయం. వేర్వేరుగా జరిగితే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం చాలా వరకూ తగ్గిపోతుందన్నది గతంలో ఓ సర్వేలో తేలిన వాస్తవం. ఎన్నికల ఖర్చు విషయంలోనూ జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడవలసి రావచ్చు. దానివల్ల వాటిపై భారంపడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ప్రాంతీయ పార్టీలు కలసి వచ్చే అవకాశం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో బిజెపి చిరకాలవాంఛ ఎలా నెరవేరుతుందో వేచి చూడవలసిందే.