జమిలి ఎన్నికలను ప్రతిపాదిస్తున్న రెండు బిల్లులను పరిశీలించే పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెపిసి)లో సభ్యుల సంఖ్యను ప్రభుత్వం హెచ్చిస్తున్నది. మరిన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కమిటీలో సంఖ్యా బలాన్ని 31 మంది ఎంపిల నుంచి 39 మంది ఎంపిలకు ప్రభుత్వం పెంచుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్‌సభ ఎంపిల జాబితాలో ఇప్పుడు శివసేన (యుబిటి), సిపిఐ (ఎం), లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి ఒక్కొక్క సభ్యుడు, ఇంకా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచి మరి ఇద్దరు సభ్యులు, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నుంచి మరొక సభ్యుడు ఉన్నారు. శుక్రవారం లోక్‌సభ కోసం నిర్ణయించిన సభా కార్యకలాపాల జాబితాలో సంయుక్త కమిటీకి రెండు బిల్లులను నివేదించేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఉన్నది. కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉంటారు.
కమిటీలో భాగంగా ప్రతిపాదించిన లోక్‌సభ కొత్త సభ్యుల్లో బిజెపి నుంచి బైజయంత్ పాండా, సంజయ్ జైశ్వాల్, ఎస్‌పి నుంచి ఛోటేలాల్, శివసేన (యుబిటి) నుంచి అనిల్ దేశాయ్, ఎల్‌జెపి నుంచి శాంభవి, సిపిఐ (ఎం) నుంచి కె రాధాకృష్ణన్ ఉన్నారు. రాజ్యాంగంసవరణ బిల్లుతో సహా ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ (ఒఎన్‌ఒఇ) బిల్లులు రెండింటిని కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ కోసం ప్రతిపాదించిన లోక్‌సభ సభ్యుల్లో బిజెపి నుంచి మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పిపిచౌదరితో పాటు భర్తృహరి మహతాబ్, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. లోక్‌సభ సభ్యుల్లో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నుంచి 17 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 12 మంది బిజెపికి చెందినవారు.