Saturday, November 23, 2024

జమ్మి చెట్టు, పాలపిట్ట మన సంస్కృతిలో భాగం: సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

జమ్మి చెట్టు, పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం, కాపాడుకుందాం

మన పురాణాల్లో ఉన్న జమ్మి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రీన్ ఛాలెంజ్: ఎంపి జోగినపల్లి

దసరా సందర్భంగా ప్రతీ ఊరిల, గుడిలో జమ్మిచెట్టు నాటే కార్యక్రమం..

మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం జీవన విధానంలో భాగం కావాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Jammi chettu and Milk quail in our culture

హైదరాబాద్: వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం గుర్తించిందని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి లతో కలిసి ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో జమ్మి మొక్కలు నాటి రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు.

దసరా పండగ సందర్భంగా అన్ని గ్రామాలు, గుడుల్లో కలిపి లక్షా ఇరవై వేల జమ్మి మొక్కలను నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడారు.

అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అటవీ, దేవాదాయ శాఖలకు ఎంపి కృతజ్జతలు తెలిపారు.

తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారంగా వస్తుందని, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ అని తెలిపారు. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఎంపి సంతోష్ కుమార్ తీసుకోవటాన్ని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుడుల్లో జమ్మి చెట్టు నాటి, పెంచేలా దేవాదాయ శాఖ ద్వారా చొరవ తీసుకుంటున్నామని వెల్లడించారు.

యువ ఎంపిగా ఉన్న సంతోష్ కుమార్ పర్యావరణంతో పాటు సంస్కృతికి ప్రాధాన్యతను ఇవ్వటం సంతోషకరమని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఫారెస్ట్ కార్పోరేషన్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి కార్యక్రమాన్ని విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎంపి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.

బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్

 ఐటీ కారిడార్ తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఆక్సీజన్ హబ్ గా, రోజు వారీ వాకింగ్ తో పాటు వారాంతాల్లో కుటుంబాలకు సేదతీరే ప్రాంతంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకుందని సంతోష్ తెలిపారు. 270 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం, అటవీశాఖ చొరవతో ప్రకృతివనంగా మారిందని ప్రశంసించారు. ఇవాళ సమావేశం సందర్భంగా బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ తమ అధ్యక్షుడిగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్భుతంగా తీర్చిదిద్దిన బొటానికల్ గార్డెన్స్ విశిష్టతను కాపాడేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఎంపి హామీఇచ్చారు.

వజ్రోత్సవ వేడుకల సదర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News