Thursday, September 19, 2024

జమ్మూ కశ్మీర్, హర్యానా ఎని ్నకలకు మోగిన నగారా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలు మూడు దశలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) శుక్రవారం ప్రకటించింది. 90 మంది సభ్యుల హర్యానా శాసనసభ ఎన్నికలను అక్టోబర్ 1న నిర్వహించనున్నట్లు ఇసి తెలియజేసింది. ఆ రెండు ఎన్నికల వోట్ల లెక్కింపు అక్టోబర్ 4న జరుగుతుందని కమిషన్ తెలిపింది. ఎన్నికల సన్నాహకాల పర్యవేక్షణకు ఇసి అధికారులు ఆ రెండు రాష్ట్రాలను ఇటీవల సందర్శించిన అనంతం ఈ ప్రకటన చోటు చేసుకున్నది. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు సమక్షంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ శుక్రవారం విలేకరుల గోష్ఠిలో ఈ ఎన్నికల ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండవ దశలో 26 సీట్లకు, చివరి దశలో 40 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 2019లో హర్యానాతో పాటే ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను తరువాత ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత అవసరాల కారణంగా మహారాష్ట్రకు ఇప్పుడు ఎన్నికలు ప్రకటించలేదని ఆయన వివరించారు. ఈ ఏడాది ఝార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగవలసి ఉన్నది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత, రాజ్యాంగంలోని 370 అధికరణం కింద ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన దరిమిలా ఐదు సంవత్సరాలకు పైగా గడచిన తరువాత ఒక కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండవ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 90. హర్యానా అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్‌లో ముగుస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు సెప్టెంబర్ 30ని గడువుగా నిర్దేశించింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కోరసాగాయి. 370 అధికరణం అమలులో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్‌కు సొంత రాజ్యాంగం, రక్షణ, కమ్యూనికేషన్లు, విదేశీ వ్యవహారాల్లో మినహా అన్ని విషయాల్లో విధాన నిర్ణాయక అధికారాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2014 నవంబర్, డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బిజెపి, పిడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పిడిపి వ్యవస్థాపక నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

2016 జనవరిలో సయీద్ మరణానంతరం స్వల్ప కాలం గవర్నర్ పాలన తరువాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 జూన్‌లో పిడిపి సారథ్యంలోని ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉపసంహరించగా అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీని రద్దు చేశారు. రాష్ట్రానికి అప్పటి నుంచి అసెంబ్లీ లేదు. జమ్మూ కాశ్మీర్‌లో శ్రీనగర్, గండెర్‌బల్, పూంఛ్, రాజౌరి, రియాసి సహా ప్రధాన ప్రాంతాలు రెండవ దశలో వోట్లు వేస్తాయి. తుది దశలో ఉత్తర కాశ్మీర్‌లోని ఉద్ధంపూర్, జమ్మూ, కథువాలో ప్రజలు తమ వోట్లు వేస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అధ్వాన ప్రదర్శన చేసిన మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పిడిపి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని లక్షంతో ఉన్నది. మొత్తం 90 సీట్లకు పోటీ చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జమ్మూపై దృష్టి కేంద్రీకరించవచ్చు. కాశ్మీర్‌తో పోలిస్తే జమ్మూలోనే పార్టీకి ఎక్కువ మద్దతు, సంస్థాగత వ్యవస్థ ఉన్నాయి. మరొక వైపు బిజెపి కూడా తన ఎన్నికల సన్నాహకాలు ముమ్మరం చేసింది. ఇక హర్యానాలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. అక్కడ బిజెపి, కాంగ్రెస్, జన్‌నాయక్ జనతా పార్టీ (జెజెపి), ఐఎన్‌ఎల్‌డి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) & ఐదు పార్టీల మధ్య పోటీ జరగవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News