Wednesday, January 22, 2025

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి

- Advertisement -
- Advertisement -

దాదాపు పదేళ్ల తరువాత శాసనసభ ఎన్నికలకు జమ్ముకశ్మీర్ సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 90కి చేరుకున్న కశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు, అన్నే సీట్లు ఉన్న హర్యానాకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ముహూర్తం నిర్ణయించింది. జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ మూడు దశలలోనూ, హర్యానాలో ఒకే దశలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 18 అక్టోబర్ 1వ తేదీ మధ్య జమ్ముకశ్మీర్‌కు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలంటూ సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, కొన్ని నెలలుగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ వచ్చింది. చివరిసారిగా జమ్ముకశ్మీర్‌లో 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో కశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 90కి పెరిగింది.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా మొత్తం సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ పరాభవం పాలైంది. కాగా బిజెపి 25 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటులో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అయితే రెండేళ్లు తిరిగే సరికి బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కశ్మీర్ జోలికి పోకుండా జమ్ము, ఉధంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను పోటీకి నిలబెట్టి, ఆ రెండింటా విజయం సాధించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కశ్మీర్ లోయలోనూ పాగా వేసేందుకు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించిన కమలనాథులు కశ్మీర్ లోయలో పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల ప్రాబల్యం తగ్గించే దిశగా పావులు కదుపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుపోయేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సత్ఫలితాలనిస్తాయో వేచిచూడాలి. కశ్మీర్‌లో కీలక రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీలు విడివిడిగానే పోటీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వీటి వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటిది. ఇటీవలి కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ అలజడి రేకెత్తిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం అత్యవసరం. ఎన్నికల సిబ్బందికి సైతం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎత్తయిన మంచుకొండలపై ఉండే పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చడం కష్టతరమైన పని. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌పై దృష్టి సారించేందుకు వీలుగా మహారాష్ట్ర, జార్ఘండ్, ఢిల్లీ ఎన్నికల గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటన అర్థం చేసుకోదగినదే. శాంతిభద్రతల పునరుద్ధరణ, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం- ఈ రెండు లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఆ దిశగా సాధించింది ఏమీ లేదనే చెప్పాలి.

ఇటీవలి కాలంలో అటు జమ్ములోనూ, ఇటు కశ్మీర్ లోయలోనూ ఉగ్రవాద చర్యలు ఊపందుకున్నాయి. సైనికులపైనా దాడులు పెచ్చుమీరుతున్నాయి. ప్రత్యేక హోదా రద్దయ్యాక ఆ రాష్ట్రంలో జనజీవన స్థితిగతులు కూడా చెప్పుకోదగిన రీతిలో మెరుగైన దాఖలాలు కూడా ఏమీ లేవు. గడచిన మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జమ్ము కశ్మీర్‌లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే అలవరసలపై శాసనసభ ఎన్నికలు సైతం సజావుగా సాగి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడితే పాలన గాడిన పడి, శాంతి భద్రతల పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News