Saturday, November 2, 2024

ఉగ్రవాదులు పాక్ మాజీ సైనికులే

- Advertisement -
- Advertisement -

జమ్మూ : జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు పెట్టనికోట అయింది. పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనికులు ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద బృందాలలో కీలక నిర్వహకుల పాత్రలలో ఉన్నారు. ఈ విషయాన్ని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం జమ్మూలో తెలిపారు. రాజౌరీ జిల్లాలో జరిగిన సుదీర్ఘ విస్తృత స్థాయి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారతీయ సైనికాధికారులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పిర్ పంజాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరేకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని ద్వివేది తెలిపారు. అక్కడ లష్కరే తోయిబా అగ్రస్థాయి దళనేత ఖ్వారీ, మరో ఉగ్రవాది హతులు అయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలకు దీనితో ఆటకట్టు అవుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో అమరులైన సైనిక సిబ్బందికి శుక్రవారం జనరల్ ఉపేంద్ర నివాళులు అర్పించారు. వారి భౌతికకాయాలపై పుష్ఫగుచ్ఛాలుంచారు.

రాజౌరీ ఎన్‌కౌంటర్‌తో ఉగ్రవాదం జాడలు, ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో కొన్ని అనువైన ప్రాంతాలను ఎంచుకుని సాగుతున్న వారి కార్యకలాపాలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ సైనికులు పాకిస్థాన్ నుంచి వచ్చి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దళాలలో పనిచేస్తున్నారు. యుద్ధాలలో వారి అనుభవాలను ఈ దళాలకు అందిస్తున్నారని, ఇటీవలి ఎన్‌కౌంటర్ దశలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అదును చూసుకుని ఉగ్రవాదులు చొరబాట్లకు దిగుతున్నారు. ఇందుకు పాకిస్థాన్ సైనిక దళాల నుంచి కూడా తగు విధమైన సాయం అందుతోందని చెప్పారు. రాజౌరీ , పూంచ్ జిల్లాల్లో దాదాపుగా పాతిక మంది వరకూ ఉగ్రవాదులు చురుగ్గా కదులుతున్నారు. ఆయా ప్రాంతాలలోని భౌగోళిక స్వరూపాన్ని ఆసరాగా చేసుకుని వీరు ఎక్కువగా కొండలు, అడవులలో ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారని తెలిపారు.

ఉగ్రవాదులు ఏ సంఖ్యలో ఉన్నా ఓ ఏడాదిలో ఈ ప్రాంతంలో ఎటువంటి ఉగ్రవాద బెడద లేకుండా చేసితీరుతామని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ స్థానిక పోలీసు బలగాలు, నిఘా వర్గాల నుంచి తగు సమాచారం వారి సహాయం తీసుకుంటూ సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటి ఎన్‌కౌంటర్‌లో మన సైన్యానికి నష్టం వాటిల్లినా , ఉగ్రవాద కమాండర్లు ఇద్దరు మృతి చెందడం, చొరబాటుదార్ల కదలికలపై తగు నిఘా విధించేందుకు దారి ఏర్పడిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News