Friday, November 22, 2024

ఎన్‌ఐఎకు డ్రోన్‌దాడి కేసు

- Advertisement -
- Advertisement -

జమ్మూ దాడి కేసు దర్యాప్తు ఎన్‌ఐఎకు అప్పగింత
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: జమ్మూ ఎయర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎకు అప్పగించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూ ఎయిర్ స్టేషన్‌పై దాడి కేసు దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించినట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. దేశంలోనే తొలి సారిగా జమ్మూ విమానాశ్రయంలోని వాయుసేన స్టేషన్‌పై ఆదివారం తెల్లవారు జామున దాడి చేయడానికి పాక్ ఉగ్రవాదుల్రు రెండు డ్రోన్లను ఉపయోగించిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 1.40 గంటల పారంతంలో జరిగిన ఈ దాడిలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చెందిన ఓ భవనం పైకప్పు దెబ్బతినగా, ఇద్దరు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.
దాడి వెనుక లష్కరే తయిబా హస్తం: డిజిపి
ఇదిలా ఉండగా జమ్మూ ఎయిర్‌బేస్‌పై దాడి వెనుక నిషేధిత పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా హస్తం ఉండి ఉండవచ్చని, ఎందుకంటే దాడిలో ఉపయోగించిన డ్రోన్లు సరిహద్దుకు ఆవలి వైపునుంచి వచ్చినట్లు సంకేతాలు ఉన్నాయని జమ్మూ, కశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. దాడి తర్వాత డ్రోన్లు తిరిగి పాక్‌లోకి వెళ్లి ఉండవచ్చని కూడా ఆయన చెప్పారు. అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, తమ దర్యాప్తు వివరాలను భద్రతా ఏజన్సీలకు అందిస్తామని డిజిపి తెలిపారు. పోలీసులు జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు చోట్ల దాడులు జరిపారు కానీ స్పష్టమైన ఆధారాలు ఏమీ లభించలేదు. డ్రోన్లు సరిహద్దు ఆవలి వైపునుంచి వచ్చి ఉండవచ్చని ఆయన అంటూ, తాము ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఉగ్రవాద సంస్థలనుంచి ఎదురవుతున్న ఈ కొత్త ముప్పుగురించి అన్ని కీలక సంస్థలను అప్రమత్తం చేయడం జరిగిందని, అన్ని ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నామని ఆయన చెప్పారు. అనధికారికంగా డ్రోన్లు ఉపయోగించవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.
రిమోట్ కంట్రోల్ కాదు.. న్యూస్‌పేపర్ల బండిల్!
ఇదిలా ఉండగా ఈ దాడిలో ఆధారాలు కోసం వెతుకుతున్న దర్యాప్తు అధికారులు సోమవారం ఒక సిసిటీవీ ఫుటేజిలో అస్పష్టంగా కనిపించిన దానిపై ఎనో ఆశలు పెట్టుకున్నారు. అది రిమోట్ కంట్రోల్ అయి ఉండవచ్చని అందరూ భావిచగా చివరికి అది న్యూస్‌పేపర్ల బండిల్ అని తేలింది. అంతేకాదు ఆ సిసి టీవీ ఫుటేజిలో అస్పష్టంగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులై ఉంటారని కూడా దర్యాప్తు అధికారులు భావించారు. అయితే వాస్తవానికి వారు ఓ స్థానిక దినపత్రికకు చెందిన డిస్ట్రిబ్యూటర్, అమ్మకందారని తేలిందని వారు చెప్పారు. జమ్మూలోని కల్చుక్ ప్రాంతంలో ఉన్న వైమానిక స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా రెండు డ్రోన్లు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు దాదాపు 25 రౌండ్లు కాల్పులు జరిపాయి. రాత్రి 11.45 గంటలు, 2.40 గంటల సమయంలో ఈ డ్రోన్లు కనిపించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ వైమానిక స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరోసారి డ్రోన్లు సైనిక స్థావరం మీదికి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

కాగా ఈ సంఘటన తర్వాత భద్రతా దళాలు అంతర్గత దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రక్షణ స్థావరానికి ఆనుకుని ఉన్న రోడ్డుపై ఒక కారు మెల్లగా వెళుతూ సిసిటీవీ కెమెరాలో కనిపించినట్లు భద్రతా సిబ్బంది తెలియజేశారు. కారులోని వ్యక్తి ఎదురుగా మోటారు బైక్‌పై వచ్చిన వ్యక్తికి ‘రిమోట్ కంట్రోల్’లాంటి ఓ వస్తువును అప్పగించినట్లు కూడా ఆ దృశ్యాల్లో ఉందని, ఇదంతా తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో చోటు చేసుకుందని వారు తెలిపారు. భద్రతా ఏజన్సీలు ఆ తర్వాత కారు, మోటారు బైక్‌పై వచ్చిన వ్యక్తులను గుర్తు పట్టి దర్యాప్తు కొనసాగించారు. అయితే కారులో ఉన్న ఓ వ్యక్తి ఓ స్థానిక దినపత్రిక డిస్ట్రిబ్యూటర్ అని, మోటారుబైక్‌పై వచ్చిన వ్యక్తి అదే పత్రిక అమ్మకందారని, రిమోట్ కంట్రోల్ అని భావించిన వస్తువు వాస్తవానికి న్యూస్‌పేపర్ల కట్ట అని తమ దర్యాప్తులో తేలిందని వారు చెప్పారు. కాగా జమ్మూప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో పంపిణీ చేయడం కోసం స్థానిక దిపత్రికలు తెల్లవారు జామునుంచే వాటి తరలింపు చేపడుతూ ఉండడం మామూలేనని కూడా ఆ వర్గాలు తెలిపాయి.

Jammu Drone Attack Case hands over to NIA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News