Monday, December 23, 2024

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు?

- Advertisement -
- Advertisement -

Cohabitation is also considered maritalజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరగవచ్చునని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొన్న అక్కడ పర్యటిస్తూ ప్రకటించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకటన గత మే 5న వెలువడినప్పుడే యెన్నికల సంకేతాలు బలంగా వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత బిజెపి, వివాదాస్పదమైనవిగా పరిగణించి అంతవరకు పక్కనపెట్టిన అంశాల అమలుకు నడుం బిగించింది. అందులో మొదటిది అయోధ్య రామజన్మ భూమి వివాదం. సుప్రీంకోర్టు సహకారంతో వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగించుకోడం, ఆ మేరకు అక్కడ వైభవోపేతంగా శంకుస్థాపన మహోత్సవం జరిగిపోడమూ తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌ను దేశంలో విలీనం చేసుకోడానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.బిజెపి, కశ్మీర్‌కు విశేష ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ లభించడంతో ఆ ఏడాది ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు ఆమోదంతోనే రాజ్యాంగంలోని 370, 35ఎ అధికరణలను రద్దు చేసింది.

అంతటితో ఆగకుండా జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదానూ ఊడబెరికింది. జమ్ము, కశ్మీర్ ప్రాంతాలు రెండింటిని కలిపి వొక కేంద్రపాలిత ప్రాంతం గాను, లడఖ్‌ను మరో కేంద్ర పాలిత ప్రాంతంగాను విభజించింది. కేంద్రం తీసుకొన్న ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు అభిప్రాయం యింకా వెలువడలేదు. ఈ తీవ్ర మార్పులకు అక్కడి ప్రజల ఆమోదమూ లభించలేదు. అసెంబ్లీ యెన్నికలలో నేరుగా తాను గాని, తన మద్దతుతో నిలబడే శక్తి గాని గెలుపొందేలా చేసుకోడం ద్వారా తన చర్యలకు జమ్మూకశ్మీర్ ప్రజల అండ లభించినట్లు చాటుకోవాలని బిజెపి చూస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము, కశ్మీర్ రెండు ప్రాంతాల జనం కోటి ఇరవై ఐదు లక్షల మంది.

ఇందులో 68.31 శాతం మంది ముస్లింలు, 28.43 శాతం మంది హిందువులు. ముస్లింలు అత్యధికంగా కశ్మీర్ లోయలో, హిందువులు జమ్ము లో నివసిస్తున్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ కొత్త నియోజకవర్గాల పరిధులను నిర్ణయించినప్పుడు కశ్మీర్‌లో వొక్కొక్క దానికి లక్ష నలభై వేల మంది వంతున లెక్కించి, జమ్మూలో లక్ష ఇరవై వేల మందికే వొక నియోజక వర్గాన్ని కేటాయించింది. ఆ విధంగా అంతవరకు 37 నియోజక వర్గాలే ఉండిన జమ్ములో ఆరు స్థానాలు పెంచి ఆ ప్రాంతం 43 స్థానాలు పొందేలా చేసింది. అప్పటి వరకు 46 స్థానాలుండిన కశ్మీర్‌కు వొక్క దానినే కలిపి దాని నియోజకవర్గాల సంఖ్యను 47 చేసింది. జనాభా ఆధారంగా కేటాయింపు జరిగే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణలో రెండు ప్రాంతాలకు వేర్వేరు ప్రమాణాలు పాటించడం, కశ్మీరీ పండిట్లకు రెండు నామినేటెడ్ స్థానాలు కట్టబెట్టడం మెజారిటీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా యెన్నికల తీర్పు వెలువడడానికి కేంద్రంలోని బిజెపి పాలకులు పన్నిన పన్నాగమేనన్న విమర్శ వెల్లువెత్తింది. 2014లో జరిగిన గత అసెంబ్లీ యెన్నికల్లో కశ్మీర్ లోయలో బిజెపి కనీసం వొక్క స్థానాన్నీ గెలుచుకోలేదు. అదే సమయంలో 37 స్థానాలున్న జమ్ములో 27 సీట్లను సాధించుకొన్నది.

జమ్ముకశ్మీర్ శాసనసభ రాష్ట్రపతి యెన్నికల్లో పాల్గొనలేకపోడం ఇది రెండోసారి అవుతుంది. ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370) స్థానిక హోదా (ఆర్టికల్ 35ఎ)లను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినందుకు అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, అరెస్టులతో, బలగాల మోహరింపుతో, ఇంటర్నెట్, సెల్ ఫోన్ నిలిపివేత వంటి వాటితో వారిని దారికి రప్పించుకోడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు బెడిసికొట్టాయి. మాజీ ముఖ్యమంత్రులు సహా కీలక నేతలను చాలా కాలం నిర్బంధంలో వుంచి విడుదల చేసిన తర్వాత అక్కడి పార్టీలన్నీ ఫరూఖ్ అబ్దుల్లా యింటిలో సమావేశమై గుప్కార్ కమిటీగా యేర్పడ్డాయి. ప్రజాభిప్రాయ మచ్చు చూడడానికి కేంద్రం జరిపించిన జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల యెన్నికల్లో గుప్కార్ పార్టీలదే పై చేయి అయి బిజెపి భంగపాటును చవిచూసింది. కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పని చేయాలని అక్కడి ప్రతిపక్షాలు డిమాండు చేశాయి.

ఇంకొక వైపు కశ్మీరీ పండిట్లను, జమ్ము నుంచి ఎస్‌సిలను తెచ్చి లోయలో ఉద్యోగాలిచ్చి అక్కడ వారిని స్థిరపరచడానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలను ఉగ్రవాదులు భగ్నం చేస్తున్నారు. పండిట్లను ఇతర హిందువులను ఎంపిక చేసి కాల్చి చంపుతున్నారు. దానితో వారు ప్రాణాలరచేత పట్టుకొని జమ్ము తదితర ప్రాంతాలకు కుటుంబాలు సహా తరలిపోతున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో గల జమ్మూకశ్మీర్‌లోకి అది ఉగ్రవాదులను పంపిస్తున్నది. అటువంటి ప్రాంతంలో శాంతిని, సుస్థిరతను నెలకొల్పడానికి పాటు పడుతున్నట్టు ప్రధాని మోడీ ప్రభుత్వం చెప్పుకొంటున్నది. అయితే అందుకు అక్కడి ప్రజల మద్దతు పొందడంలోనే విఫలమవుతున్నది. వారి హృదయ పూర్వక సహకార భాగస్వామ్యాలతోనే అది సాధ్యమవుతుందనే వాస్తవాన్ని అది గమనించవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News