Sunday, December 22, 2024

కశ్మీర్… బిజెపికి రెఫరెండమే!

- Advertisement -
- Advertisement -

హిమాలయాలతో నిత్యం అతిశీతల వాతావరణం ఆవరించిన జమ్మూకశ్మీర్‌లో చలిగాలులు కన్నా ఎన్నికల వడగాలులే తీవ్రంగా వీస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఘట్టం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుండడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. హామీల జల్లులు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్, మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధానంగా ఆర్టికల్ 370 ను రద్దు చేసి ఇదివరకులా ప్రత్యేక స్వయంప్రతిపత్తితో రాష్ట్రహోదా కల్పిస్తామని తమ అజెండాలో ప్రధాన అంశంగా ప్రకటించాయి. కాషాయం పార్టీ బిజెపి ఆర్టికల్ 370 రద్దు ముగిసిపోయిన చరిత్ర అని, ఎట్టిపరిస్థితుల్లో పునరుద్ధరించేది లేదని స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 370 వల్లనే కశ్మీర్ యువకులు హింస వైపు మళ్లారని కూడా హెచ్చరిస్తోంది.

ఈ రెండు పార్టీలు ఈసారి మహిళలకు ప్రయోజనం కలిగించే ఉచిత హామీలను ప్రకటించాయి. అలాగే యువతను ఆకట్టుకోడానికి పథకాలు ప్రకటించాయి. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని యువత బిజెపి వైపు ఉంటేనే రక్షణ కలుగుతుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా కశ్మీర్ యువతతో కేంద్రం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్ యువత ఆందోళనలు సాగించినప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపి అణగదొక్కిందన్న సంగతి కాషాయ నాథులు మరిచిపోరాదు. ఇంకా చాలా మంది యువకులు ఆ కేసుల్లో నిందితులై జైళ్లలో ఇంకా మగ్గుతున్నారు.

ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కాషాయం కండువా కప్పుకుంటుందా? లేక కాంగ్రెస్ స్నేహ ‘హస్తం’ అందుకుంటుందా? అన్నది ఎన్నికల ఫలితాలు చెబుతాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత వచ్చిన ఈ మొదటి ఎన్నికల ఫలితాలు బిజెపి ప్రభుత్వానికి రెఫరెండం కానున్నాయి. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు సంయుక్తంగా పోటీలో ఉన్నాయి. మరోవైపు బిజెపి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీలు గట్టిపోటీ ఇస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ క్రమంగా 51, 36 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల విజయావకాశాలు మెరుగ్గా ఉండవచ్చని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 19.3 శాతం, నేషనల్ కాంగ్రెస్ 22.2 శాతం ఓట్లు సాధించుకున్నాయి. కశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బాగానే తన పనితీరు చూపిస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. మరోవైపు జమ్మూలో మోడీ ప్రభుత్వం బలం పెంచుకుంది. జమ్మూలో మెజారిటీ సంఖ్యలో హిందువులు 37 నుంచి 43 సీట్ల వరకు ఉన్నారు.

హిందూ ముఖ్యమంత్రి కావాలన్న నినాదంతో బిజెపి ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ దీనికి అనుగుణంగానే జమ్మూ రీజియన్‌లో 43 స్థానాలపై దృష్టి పెట్టి ప్రచారం సాగిస్తోంది. జమ్మూలో బిజెపి ఓట్ల బ్యాంకును కొల్లగొట్టాలన్నదే కాంగ్రెస్ వ్యూహం. సిపిఎం, జె అండ్‌కె పీపుల్స్ కాన్ఫరెన్స్ అవామీ ఇతిహాద్ తదితర పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన మాజీ సిఎం గులామ్ నబీ అజాద్ స్వంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ పెట్టినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా తీహార్ జైలు నుంచి ఇటీవలనే విడుదలైన బారాముల్లా ఎంపి ఇంజినీర్ రషీద్ అవామీ ఇతిహాద్ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించడంపై పిడిపి, సిపిఎం పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బిజెపికి డెమ్మీ అయిన ఇంజినీర్ రషీద్ వల్ల ఓట్లు చీలిపోతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పిడిపి నేత, మాజీ సిఎం ముఫ్తీ మెహబూబా విమర్శించారు. అవామీ ఇతిహాద్ పార్టీ అభ్యర్థులనేవారు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారని వారికి బిజెపి వెనుక నుంచి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.

ఈ ఆరోపణలను ఇంజినీర్ ఎంపీ రషీద్ కొట్టి పారేస్తున్నారు. ప్రధాని మోడీ ‘నయా కశ్మీర్’ బూటకపు నినాదానికి వ్యతిరేకంగా పోరాడతానని శపథంచేశారు. మరి ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చెప్పలేం. మరోవైపు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గత ఐదేళ్లలో జమ్మూకశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశామని, ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75% మంది ప్రజలు వెల్లడిస్తారని నమ్మబలుకుతున్నారు. బిజెపి విజయం సాధిస్తే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఓడిపోతే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే జమ్ముకశ్మీర్‌లో తన పాలన పరోక్షంగా సాగించే పరిస్థితి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు విశేషమైన అధికారాలను కల్పిస్తూ కేంద్రం ఇటీవలనే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. కశ్మీర్ కిరీటాన్ని సాధించాలన్న పట్టుదలతో బిజెపి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News