ఆరేళ్ల తర్వాత ప్రారంభమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస చోటు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్‌ఎల్‌ఎ పర్రా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానంపై అభ్యంతరం చెబుతూ బీజేపీ సభ్యులు ఆందోళన తెలియజేశారు. అయితే అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ అటువంటి తీర్మానాన్ని తానింకా అంగీకరించలేదని చెప్పారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 2019 లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో 2019 లో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. దీంతోపాటు ఆ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది.
జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం లోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. ఒమర్ అబ్దుల్లా కూడా గత ఐదేళ్లుగా అందుకోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీకాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. 90 స్థానాల శాసన సభలో ఎన్‌సీ 42 సీట్లలో , కాంగ్రెస్ 6 స్థానాల్లో నెగ్గాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి.