చైనా సరిహద్దుల్లోని లడఖ్‌లో రగులుకొంటున్న ఆరవ షెడ్యూల్ ఉద్యమాన్ని 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి కశ్మీర్ బయటి ప్రాంతం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనగా చూడక తప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూకశ్మీర్‌పై ఆదరాబాదరాగా తీసుకొన్న విధాన నిర్ణయంలోని ప్రజా వ్యతిరేక లక్షణాన్ని ఇది ఎత్తి చూపుతున్నది. కశ్మీర్‌కున్న ప్రత్యేక హక్కులను తొలగించి దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరి మరో రాష్ట్రంగానే దానిని మార్చివేయాలన్న తమ ప్రియమైన విధానాన్ని అమల్లోకి తేవాలన్న తొందరలో మోడీ ప్రభుత్వం ఆర్టికల్స్ 370, 35ఎలను రద్దు చేసింది. అంతటితో ఆగకుండా జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా తొలగించింది.
అంత వరకు ఆ రాష్ట్రంలో అంతర్భాగంగా వుంటూ వచ్చిన జమ్ము, కశ్మీర్‌లను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్‌ను మరో కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించింది. ఉమ్మడి రాష్ట్రంలో శాశ్వత నివాసులను నిర్వచించి వారికి కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించే అధికారాన్ని ఆ రాష్ట్ర శాసన సభకు ఆర్టికల్ 35ఎ కల్పించింది. అంటే అక్కడి ప్రజల ఆస్తులను జమ్మూకశ్మీర్‌కు బయటనున్న వారు కొనకుండా, అక్కడి ఉద్యోగాలను స్థానికులకు మాత్రమే అనుభవించేలా ప్రత్యేక హక్కులను ఈ అధికరణ ప్రసాదించింది. కొత్త పరిస్థితుల్లో కశ్మీర్ ప్రజలు ఈ రక్షణ కవచాన్ని కోల్పోయారు. ఈ మార్పును కశ్మీర్ లోయ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కశ్మీర్ రాజకీయ పార్టీలు కూడా స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అక్కడి అసెంబ్లీని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలో వుంచిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు జరిపించడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొని తాను తెచ్చిన మార్పులకు వారి ఆమోద ముద్ర లభించిందని చాటుకోవాలని చూస్తున్నది. కశ్మీర్ లోయ ప్రజలు దీనికి సహకరించే పరిస్థితి బొత్తిగా లేదు. ఇంచుమించు ఇదే వాతావరణం లడఖ్‌లో ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు తార్కాణమే ఇప్పుడక్కడ రగులుతున్న ఆరో షెడ్యూల్ ఉద్యమం. ఆరో షెడ్యూల్ కావాలి అని లడఖ్ ప్రాంతంలోని బడి పిల్లలు కూడా నినాదాలిస్తున్నారని వార్తలు చెబుతున్నాయి. రాజ్యాంగం 244 అధికరణలోని ఆరో షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లోని తెగలకు స్వయం ప్రతిపత్తిని హామీ ఇస్తున్నది. స్వయం పాలక అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి భూములు, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి అంశాలపై ప్రత్యేక చట్టాలను చేసుకొనే అవకాశాన్ని ఈ షెడ్యూల్ కలిగిస్తుంది.
ఆర్టికల్ 370 కల్పించిన స్వయం ప్రతిపత్తి రక్షణలోని జమ్మూకశ్మీర్‌లో తాము అనుభవించిన ప్రత్యేక సదుపాయాలను ఇప్పుడు కోల్పోయామని కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త విధానం ఉగ్రవాద బీజాలను చల్లుతున్నదని యువత భారతీయ సమాజానికి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నదని లడఖ్ ప్రజల తలలో నాలుక అనదగిన నేత సోమం వాంగ్ చుక్ వెలిబుచ్చిన అభిప్రాయం గమనించదగినది. ఈయన విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్నారు. నిరుద్యోగం, విచక్షణ రహితమైన పోలీసు దౌర్జన్యం అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నదని ఆయన చెప్పారు. లే నగరంలో పోటీ పరీక్షలు నెగ్గిన విద్యార్థులకు ప్రైజులు ఇవ్వడానికి వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఉద్దేశించి ఆరో షెడ్యూల్ అమలు చేయాలంటూ నినాదాలిచ్చిన చిన్నారులను కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకు పోయారని, ఖర్దుంగ్ లా అనే చోట నిరాహార దీక్ష చేపట్టబోయిన తనను గృహ నిర్బంధంలో వుంచారని వాంగ్ చుక్ చెప్పారు. బహిరంగంగా రాజ్యాంగ షెడ్యూల్ (ఆరవ)ను ప్రస్తావించడమే నేరమా అని ఆయన ప్రశ్నించారు.
12,000 మందికి ఉద్యోగాలిస్తామని చెప్పి కేవలం 800 మందికి మాత్రమే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాంగ్ చుక్ లే లో ఇటీవలే ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష జరిపారు. ఈ సందర్భంగా జరిపిన నిరసన ప్రదర్శనలో 2000 మంది పాల్గొన్నారని వార్తలు చెబుతున్నాయి. 370 అధికరణ అమల్లో వున్నప్పుడే తాము సుఖంగా వున్నామని, బడా పారిశ్రామిక వేత్తలు కొల్లగొట్టకుండా తమ భూములు, ఆస్తులు సురక్షితంగా వున్నాయని వాంగ్ చుక్ వెలిబుచ్చిన అభిప్రాయం లడఖ్ ప్రజలు కూడా 2019 ఆగస్టు 5కు పూర్వ పరిస్థితినే కోరుకొంటున్నారని చాటుతున్నది. అప్పుడు వుండిన కశ్మీర్ అసెంబ్లీలో తమకు నలుగురు ప్రతినిధులుండేవారని ఇప్పుడు బయటి వ్యక్తి అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నిరంకుశ పాలనలో మగ్గుతున్నామని వాంగ్ చుక్ చెప్పారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా వారి అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలను రుద్దడం బెడిసికొడుతుందని లడఖ్‌లోని తాజా పరిస్థితులు చాటుతున్నాయి.