Monday, January 20, 2025

పారిశ్రామిక జవసత్వాల జంషెడ్జీ

- Advertisement -
- Advertisement -

ప్రధానంగా వ్యవసాయాధారితమైన భారత దేశంలో నేటికీ దాదాపు 60% మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 18% భాగస్వాములవుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశం తీవ్ర ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. అయితే, దేశ సమగ్రాభివృద్ధికి వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం కూడా అత్యంత కీలకమని భావించి రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం కల్పించారు. భారత దేశ పారిశ్రామిక రంగం అనగానే ప్రప్రథమంగా గుర్తుకు వచ్చే పేర్లు టాటా, బిర్లా. పారిశ్రామిక రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిలో ఈ రెండు కుటుంబాల భాగస్వామ్యం అత్యంత శ్లాఘనీయమైనది.

ముంబై ప్రధాన కార్యాలయంగా 1868లో జంషెడ్జీ నుస్సర్వాన్‌జీ టాటా ద్వారా స్థాపించబడిన టాటా గ్రూప్ ఆరు ఖండాల్లో, 150 కిపైగా దేశాల్లో ఉత్పత్తులు, సేవలతో కొనసాగుతున్న భారత దేశపు బహుళ జాతి సంస్థ. టాటా గ్రూప్ 9,35,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. టాటా గ్రూప్ ఉద్యోగులలో 63% పురుషులు కాగా, 37% మహిళలు. 2021 -22 ఆర్ధిక సంవత్సరాంతానికి ఈ గ్రూప్ నికర విలువ (Networth) 311 బిలియన్ల అమెరికన్ డాలర్లు. భారత దేశంలో అనేక పరిశోధన, విద్య, సాంస్కృతిక సంస్థలను స్థాపించడానికి ఆర్థిక సహాయం చేసిన టాటా గ్రూప్ ప్రతిష్ఠాత్మక కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రోపీ (Carnegie Medal of Philanthropy) ని అందుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్- ఎమెరిటస్, 85 సంవత్సరాల రతన్ టాటా నిస్సందేహంగా మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఇష్టపడే, ఆరాధించబడే వ్యక్తులలో ఒకరు. విశేషమైన వ్యాపార దూరదృష్టిని కలిగి ఉండటం, దాతృత్వానికి పర్యాయపదంగానిలిచే ఆయన కీర్తి లేదా విజయాలకు ఉప్పొంగక అత్యంత సాదాసీదా జీవనం గడిపే గొప్ప మానవతావాది.

జంషెడ్జీ నుస్సర్వాన్‌జీ టాటా
జోరాస్ట్రియన్ పార్సీ కుటుంబానికి చెందిన జంషెడ్జీ 3 మార్చి 1839న గుజరాత్‌లోని నవ్ సారిలో నుస్సర్వాన్‌జీ, జీవన్‌బాయి టాటా దంపతులకు జన్మించారు. ఆయన 1858లో బొంబాయి లోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి డిగ్రీ పొందాడు. అనేక దేశాలలో జరిపిన వివిధ సర్వేలు, అభిప్రాయ సేకరణల ద్వారా ఆయన గత శతాబ్దపు గొప్ప పరోపకారుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఆయనను భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారత పారిశ్రామికరంగ పితామహుడుగా, ఏక- వ్యక్తి ప్రణాళికా సంఘం (One -Man Planning Commission)గా అభివర్ణించేవారు. జంషెడ్ పూర్ నగరాన్ని నిర్మించిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కింది. తొలుత తన తండ్రి స్థాపించిన ఎగుమతి -వర్తక సంస్థలో చేరిన ఆయన జపాన్, చైనా, యూరప్, అమెరికాలో దాని శాఖలను స్థాపించడంలో సహాయపడ్డాడు.

1870లో రూ. 21,000 మూలధనంతో వాణి జ్య సంస్థను స్థాపించడంతో పాటు చించ్‌పోక్లిలో ఖాయిలా పడ్డ ఆయిల్ మిల్లును కొనుగోలు చేసి దానికి అలెగ్జాండ్రా కాటన్ మిల్లుగా నామకరణం చేశారు. అయితే కొంత కాలం తరువాత దానిని లాభం కోసం విక్రయించారు. 1874లో నాగ్‌పూర్‌లో నూతనంగా ఎంప్రెస్ కాటన్ మిల్లును స్థాపించాడు. 1885లో పాండిచ్చేరి సమీపంలోని ఫ్రెంచ్ కాలనీలకు భారతీయ వస్త్రాలను పంపిణీ చేసే ఉద్దేశంతో మరొక కంపెనీని ప్రారంభించినప్పటికీ తగినంత డిమాండ్ లేకపోవడంతో ఇది విఫలమైంది. దీంతో బొంబాయిలోని కుర్లా వద్ద ధరమ్సీ మిల్స్‌ను, అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ మిల్స్‌ను నెలకొల్పాడు.1905 వరకు స్వదేశీ ఉద్యమం ప్రారంభమవ్వనప్పటికీ ఈ సిద్ధాంతానికి ప్రభావితుడైన ఆయన బొంబాయిలో నిర్మించిన తన కొత్త పత్తి మిల్లుకు ‘స్వదేశీ మిల్లు’ అని పేరు పెట్టాడు.

భారత్ అన్ని రకాల బట్టల తయారీదారుగానే కాక ఎగుమతిదారుగా ఎదగాలన్నది ఆయ న ఆశయం. చేనేత వస్త్రాల తయారీలో భారత్ గుత్తాధిపత్యం కలిగి ఉండాలని పరితపించే ఆయన దేశంలోని వివిధ ప్రాంతా ల్లో పండే పత్తి సాగును మెరుగుపరచడానికి, మృదువైన పత్తికి ప్రసిద్ధి చెందిన ఈజిప్షియన్ సాగు పద్ధతితో సహా ఎన్నో ప్రయోగాలు చేశారు. భారత మిల్లులలో రింగ్ స్పిండిల్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
భారత్‌లో ఒక భారీ ఇనుము, ఉక్కు పరిశ్రమ, విలక్షణమైన హోటల్, ఉన్నత స్థాయి విద్యా సౌకర్యం, జలవిద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాలన్న ఆయన జీవిత లక్ష్యంలో భాగంగా 1903 లో ముంబై లోని కొలాబా తీరంలో ప్రారంభమైన తాజ్‌మహల్ హోటల్ భారత దేశపు మొట్టమొదటి విద్యుత్తు హోటల్‌గా పేరు గడించింది. 1904లో జంషెడ్జీ టాటా మరణానంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన పెద్ద కుమారుడు దొరాబ్జీ టాటా 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ఇప్పుడు టాటా స్టీల్) స్థాపించారు.

ఇది ఆసియా ఖండంలోనే మొదటి, భారత దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం. లండన్ ప్రధాన కార్యాలయంగా ఏటా 28 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్న బ్రిటిష్- డచ్ సంస్థ కోరస్ గ్రూప్‌ను (Corus Group) కొనుగోలు చేసిన తర్వాత టాటా స్టీల్ యూరోప్ లిమిటెడ్ (Tata Steel Europe Ltd)గా రూపాంతరం చెందిన ఈ కంపెనీ ప్రధానంగా యునైటెడ్ కింగ్‌డం, నెదర్లాండ్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద స్టీల్ కంపెనీగా అవతరించింది. జంషెడ్జీ టాటా ఆశయాల మేరకు 1915లో దేశంలో మొట్టమొదటి హైడ్రో పవర్ ప్లాంట్ టాటా పవర్‌ను 72 మెగా వాట్ల సామర్థ్యంతో మహారాష్ట్రలోని ఖోపోలిలో ప్రారంభించబడింది. ఇది ముంబయి నగరానికి స్వచ్ఛమైన, సమృద్ధమైన విద్యుత్ అందించాలనే దృక్పథంతో ఏర్పా టు చేయబడిన భారత దేశపు మొట్టమొదటి క్లీన్ ఎనర్జీ ప్లాంట్. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ప్రధాన వ్యాపారం విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ చేయడం.

14,076 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంతో, ఇది భారత దేశంలో అతిపెద్ద సమగ్ర విద్యుత్ సంస్థ. 2017లో ఐఐఎం, ఉదయపూర్ రూపొందించిన రెస్పాన్సిబుల్ బిజినెస్ ర్యాంకింగ్స్ (Responsible Business Rankings) నివేదిక ప్రకారం టాటా పవర్ 3వ స్థానంలో ఉంది. అంతేకాక ఫిబ్రవరి 2017 లో 1 గిగావాట్ (జిడబ్లు) సౌర గుణకాలను (solar modules) రవాణా చేసిన మొదటి భారతీయ కంపెనీగా టాటా పవర్ అవతరించింది. 1909లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science IISc) కర్ణాటక లోని బెంగళూరులో స్థాపించబడిన ఈ సంస్థను స్థానికంగా ‘టాటా ఇన్‌స్టిట్యూట్’ అని కూడా పిలుస్తారు. ఇది భారత దేశం లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థలలో స్థానం పొందింది. 1958లో విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ 2018లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా (Institute of Eminence) అనే ప్రతిష్ఠాత్మక గుర్తింపును కూడా పొందింది.

1938లో జెఆర్‌డి టాటాగా సుపరిచితులైన జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా, టాటా గ్రూప్‌కి అధిపతిగా నియమితులయ్యారు. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ ఆస్తులు 101 అమెరికన్ మిలియన్ డాలర్ల నుండి ఏకంగా 5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 1988లో కేవలం 14 వ్యాపారాలతో ప్రారంభమైన టాటా సన్స్ ఆయన నిష్క్రమించే నాటికి 95 వ్యాపారాలకు విస్తరించింది.1952లో ఆయన స్థాపించిన టాటా ఎయిర్ సర్వీసెస్ (తరువాత టాటా ఎయిర్ లైన్స్ అని పేరు మార్చబడింది) స్థాపించి 1977 వరకు ఛైర్మన్‌గా కొనసాగినప్పటికీ, భారత ప్రభుత్వం 1953లో ఎయిర్ కార్పొరేషన్ల చట్టాన్ని ఆమోదించి టాటా సన్స్ నుండి ఎయిర్ లైన్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. అయితే భూమి గుండ్రంగా ఉందన్నట్లు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్ జనవరి 2022లో కొనుగోలు చేసింది. 1945లో టాటా మోటార్స్ ప్రారంభంలో లోకోమోటివ్‌ల తయారీ కోసం స్థాపించబడినప్పటికీ 1954లో డైమ్లర్- బెంజ్‌తో జాయింట్ వెంచర్‌ను స్థాపించి వాణిజ్య వాహనాలను విక్రయించడం ప్రారంభించింది.ఆ తరువాత 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్థాపించబడింది.

దాతృత్వం
అక్షరాస్యత, ప్రజారోగ్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా విశ్వసించే ఆయన ప్రధానంగా విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం ఉదారంగా విరాళాలు అందించారు. ఆయన దాతృత్వపు విలువ ఆధారితంగా ఎడెల్ గివ్ ఫౌండేషన్ (EdelGive Foundation), హురున్ రీసెర్చ్ ఇండియా (Hurun Research India) సంస్థలు అయనను గత శతాబ్దపు గొప్పదాతగా ప్రకటించాయి. 102 బిలియన్ డాలర్లను విరాళాలుగా అందించిన ఆయన 20వ శతాబ్దపు ప్రపంచంలోని అగ్రశ్రేణి పరోపకారుల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. టాటా గ్రూప్ తన వార్షిక లాభంలో గరిష్ఠంగా 66 శాతాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించడం వారి మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జంషెడ్జీ టాటా హీరాబాయి దాబూను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు కుమారులు, దొరాబ్జీ టాటా, రతన్ జీ టాటా జన్మించారు.

యేచన్ చంద్ర శేఖర్
8885050822

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News