అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘దఢక్’ అనే హిందీ మూవీతో సినీ రంగప్రవేశం చేసిన ఈ అందాల భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. నటన మాత్రమే కాకుండా గ్లామర్‌తోనూ ప్రేక్షకులను మైమరపిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇకపోతే జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకుందని.. ఆ పాన్ ఇండియా మూవీతోనే ఆమె ఎంట్రీ ఉంటుందని ఈ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. కానీ తారక్ సినిమా చేస్తుందని వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె తండ్రి, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ స్పష్టం చేశారు. అయితే మంచి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్ దొరికితే జాన్వీ కపూర్ తెలుగులో తప్పకుండా నటిస్తుందని ఆయన తెలిపారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా? అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అక్కినేని ప్రిన్స్ అఖిల్ మూవీతో జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోందట. ప్రస్తుతం అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే మూవీ చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత అఖిల్‌తో ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఓ పాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కరణ్ జోహర్ ఇప్పటికే ఈ చిత్ర కథను సిద్ధం చేయించి.. ఓ మంచి డైరెక్టర్‌ను కూడా లైన్‌లో పెట్టాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందని భావించి.. ఆమెతో సంప్రదింపులు జరిపారట. జాన్వీ పాజిటివ్‌గా స్పందించడంతో.. ఆమె హీరోయిన్‌గా ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రటకన రావాల్సిందే.