అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. పోలీసులు అరెస్టు చేయడంతో 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్ కాగా, అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు. 2017లో ఓ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు.. హైదరాబాద్‌కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్ సమయంలో అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలోంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశంగా తీసుకుని, తరచూ షూటింగ్ ప్రదేశాల్లో వేధించేవాడని. వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకుని దాడి చేసేవాడని. ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే.. షూటింగ్ లొకేషన్‌లో అందరి ముందు అవమానపరిచేవాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు.