కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రదానం చేయవలసి ఉన్న జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని లైంగిక దాడి ఆరోపణల దృష్టా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జాతీయ చలనచిత్ర అవార్డుల విభాగం తాత్కాలికంగా నిలిపివేసింది. మంగళవారం న్యూఢిల్లీలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు నిమిత్తం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పంపిన ఆహ్వానాన్ని కూడా అధికారులు ఉపసంహరించారు. అసలు పేరు షేక్ జానీ బాషా అయిన జానీ మాస్టర్ 2022 నాటి తమిళ చిత్రం ‘తిరుచిత్రంబలం’లో ‘మేఘం కరుక్కథ’ పాటకు గాను ఆ వేడుకలో అవార్డు అందుకోవలసి ఉన్నది. ‘పోక్సో చట్టం కింద నేరారోపణలు వెలుగులోకి రావడానికి ముందు’ కొరియోగ్రాఫర్‌కు జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవానికి హాజరు నిమిత్తం లేఖ పంపినట్లు జాతీయ సినీ అవార్డుల విభాగం శుక్రవారం (4) నాటి ప్రకటనలో తెలియజేసింది.
‘ఆరోపణల తీవ్రత, కోర్టులో పరిధిలో ఈ వ్యవహారం ఉన్న దృష్టా ‘తిరుచిత్రంబలం’ చిత్రానికి గాను కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు 2022 ఏడాదికి జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫీ పురస్కారాన్ని తదుపరి ఉత్తర్వుల వరకుసస్పెండ్ చేయాలని సముచిత సంస్థ నిర్ణయించింది. అందువల్ల మంగళవారం (8న) న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించే 70వ జాతీయ సినీ అవార్డుల ఉత్సవం కోసం షేక్ జానీ బాషాకు పంపిన ఆహ్వానాన్ని ఇందుమూలంగా ఉపసంహరించడమైంది’ అని డిప్యూటీ డైరెక్టర్ ఇంద్రాణి బోస్ సంతకం చేసిన ఆ ప్రకటన వివరించింది. ఇది ఇలా ఉండగా, ఈ అవార్డు అందుకోవడానికి వీలుగా జానీ మాస్టర్‌కు హైదరాబాద్‌లోని ఒక న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.