అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ షేక్‌జానీ బాషకు ఉప్పరపల్లి కోర్టు శుక్రవారం 14 రోజుల రిమాండ్ విధించింది. తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతి(21)పై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు షేక్ జానీ బాషాపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైనప్పటి నుంచి జానీ బాషా పరారీలో ఉన్నాడు. బెంగళూరు మీదుగా గోవా వెళ్లినట్లు తెలుసుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు గోవాలోని లాడ్జిలో గురువారం అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్‌పై శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత ఎస్‌ఓటి పోలీసులు జానీ బాషను రహస్య ప్రాంతంలో విచారించారు. తర్వాత గోల్కొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జానీ బాషాకు 14రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
పధకం ప్రకారమే…
షేక్ జానీ బాషా కేసులో నార్సింగి పోలీసులు సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలు డ్యాన్సర్‌గా ఓ టివి ప్రొగ్రాంలో పాల్గొనగా, ఈ సమయంలోనే జానీ బాషాతో పరిచయం ఏర్పడింది. అప్పుడే యువతిపై కన్నెసిన జానీ బాషా తన వద్ద అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు, తర్వాత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కస్టడీ పిటీషన్ వేయనున్న పోలీసులు
తన వద్ద పనిచేస్తున్న యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ బాషాను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఉప్పర్‌పల్లి కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిసింది. జానీ బాషాను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని, కేసుకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయని నార్సింగి పోలీసులు భావిస్తున్నారు. జానీ బాషా ఫిర్యాదు చేసిన యువతే కాకుండా మరి ఎవరిపైనా అయినా అత్యాచారం చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేయనున్నట్లు తెలిసింది. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిసింది.