Friday, November 22, 2024

26 నుండి 28 వరకు జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

పాలకవీడు ః నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తూ దినదినాబివృద్ది చెందుతూ సూర్యపేట జిల్లా నేరెడుచర్ల మండలానికి 20కిమీ ,పాలకవీడు మండల కేంద్రానికి 10కిమీ దూరాన ఉన్న జాన్‌పహాడ్ దర్గా ఉమ్మడి జిల్లాలోనే గాక, రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పేరున్న ధర్గాగా ప్రసిద్ది చెందింది. ఈనెల 26,27,28తేదీలలో ఉర్సు ఉత్సవాలు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆద్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. పక్క రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఉర్సు ఉత్సవాలకు తరలి వస్తుంటారు. ఈదర్గా ముస్లింలకు పవిత్ర స్ధలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలే దర్శించుకున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరితే కందూరు పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కలిగితే సైదులు బాబా పేరును పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తుంటారు.
లక్షల్లో భక్తులు రాక….
గత మూడు సంవత్సరాల నుండి కరోనా పరిస్ధితుల కారణంగా భక్తుల రద్దీ కొంతమేరకు తగ్గినా ఈ సంవత్సరం ఉత్సవాలకు భారీగా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. జాన్‌పహాడ్ సైదన్నను దర్శించుకునేందుకు తెలంగాణరాష్ట్రంతో పాటు ఆంద్ర,కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడుల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉర్సు ఉత్సవాలు వక్ఫ్‌బోర్డు ఆద్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు.
జాన్‌పహాడ్ దర్గా చరిత్ర…..
సుమారు 400ఏండ్ల పైబడి మద్రాసు రాష్ట్రంలోని నాగూర్ గ్రామంలో వెలిసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను తెలుగు రాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి జాన్‌పహాడ్ సైదా, బాజీసైదా, మొహినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారనే కధ ప్రచారంలోఉంది. ఈముగ్గురు భక్తులు తెలుగు రాష్ట్రాలకు చేరి నాగూర్ షరీఫ్ గొప్పతనాన్ని చాటుతూ ఊరూరా తిరగసాగారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి వారు అమరులయ్యారు. వాడపల్లి వద్ద అమరుడైన జాన్‌పహాడ్‌సైదా జ్ఞాపకార్ధం వజీరాబాద్ రాజకుమారుడు జాన్‌పహాడ్ వద్ద పవిత్ర సమాదులు కట్టించారని చెప్పుకుంటారు.

ఆతర్వాత జాన్‌పహాడ్‌ను సైదా నిర్మించాడని దీని మూలంగానే జాన్‌పహాడ్ దర్గా పేరు వాడుకలోకి వచ్చింది. ఈప్రాంతమంతా నీటి వసతి లేదని తర్జన బర్జన పడుతున్న సమయంలో వేముల శేషారెడ్డి తండ్రి మట్టారెడ్డి కలలో జాన్‌పహాడ్ సైదా కనిపించి గుర్రం డెక్కలు ఉన్నచోట బావిని తవ్వించమని చెప్పాడట. దీంతో అక్కడ నీరు కనిపించిందని పెద్దలు చెబుతుంటారు. దర్గా ప్రాంతమంతా అడవీ ప్రాంతం కావడంతో తమ దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం ఒక నాగుపాము, పెద్దపులిని ఏర్పాటు చేశారని పూర్వీకులు చెప్పారని ఇక్కడివారు చెబుతుంటారు.
తరగని ప్రసాదం…..
కృష్ణానది తీరాన ఉన్న పొందుగల గ్రామస్దులు ఒక బాలుడితో బయలుదేరి పొరుగూరితో ప్రయాణం అయినారు. మార్గమధ్యంలో ఉండగానే సూర్యాస్తమయం అయినది. అయినా అదే వెన్నెల రుతువు కావడంతో అడవిలో నడవసాగారు. ఇంతలో వారికి సైదులు బాబా దర్గా గోపురం కనిపించింది. వారి వెంట ఉన్న బాలుడు దర్గాను చూసి వద్దామన్న ఆశతో వేగంగా పరిగెత్తి దర్గాలోకి ప్రవేశించాడు. అప్పటికే రాత్రి అయింది. ఇక్కడ ఎవ్వరూ ఉండరాదని బాలుడికి తెలియక అటూ ఇటూ చూడసాగారు. ఆశ్చర్యం…

అతడికి లోపల ఇద్దరు దివ్య తేజస్సుతో ఉన్న ఇద్దరు పురుషులు ఎంతో మంత్రాలు చదవడం వినిపించింది. ఆసరాగా అటు వైపు వెళ్ళారు. వారు బాలుడి వద్దకు రమ్మని సైగ చేశారు. వారు బాలుడికి బెల్లం ముక్కను పెట్టి ప్రసాదం తీసుకోమని ఆశీర్వదించారు. బాలుడు ఉత్సాహంగా బెల్లం ముక్కను తీసుకుని తనతో వచ్చిన పెద్దల వద్దకు చేరాడు. వారికి చూసిన విషయాన్ని వివరించి చెప్పి బెల్లం ప్రసాదం వారికి కూడా పెట్టాడు. విచిత్రం… ముగ్గురూ పంచుకున్నప్పటికీ బాలుడు వంతే అంతే బెల్లం ముక్క మిగిలింది. ఇది సైదులు బాబామహిమగా చెబుతుంటారు.
నాగుల పుట్ట….
ఆనాడు దట్టమైన అరణ్య ప్రాంతంలో వచ్చే భక్తులకు అండగా ఉండేందుకు నాగుపాము ఉండేదని రాత్రిపూట సైదుల బాబా సమాదిపై పడుకునేదని కధ ప్రచారంలోఉంది. హిందువుల ఆరాధ్య దైవమైన నాగేంద్రుని ముస్లింలు కూడా పూజించడం విశేషం. ఇక్కడికి వచ్చిన వారు నాగేంద్రుని పుట్టవద్ద మొక్కులు,ముడుపులు చెల్లించుకుంటారు.
దీపం విశిష్టత…
జాన్‌పహాడ్ సైదులు బాబా దర్గాలో పవిత్ర సమాదులు వెలిసిన నాటి నుండి ఈదీపం నిత్యం వెలుగుతూనే ఉంది. భక్తులు దీపారాధన నూనెను ఎంతో పవిత్రంగా భావించి నొప్పులు ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈదీపంలో ప్రతీ శుక్రవారం రోజు వచ్చే భక్తులు నెయ్యి నూనెను దీపంలో పోస్తుంటారు. ప్రతీ సంవత్సరం ఉర్సు అయిన మరుసటి రోజు శనివారం ప్రత్యేక ప్రార్ధనలు చేసిన అనంతరం దీపాలు వెలిగిస్తారు.
సఫాయి బావి….
ఈ ప్రాంతంలో నీటి వసతులు లేని బెంబేలు పడుతున్న తరుణంలో వేముల శేషారెడ్డి తండ్రి మట్టారెడ్డి కళలో జాన్‌పహాఢ్ సైదులు బాబా కనిపించి గొర్రెపు డెక్కలు ఉన్న చోట బావిని తవ్వమని చెప్పాడట. ఆ బావి ఒక గుహ వలె కనిపిస్తుంది. బాగా లోతులో నీరు ఉంటాయి. జాన్‌పహాడ్ దర్గాను దర్శించే భక్తులు నీటిని తెచ్చుకున స్నానాలు చేస్తారు. ఈనీటితోనే వంటలు చేస్తుంటారు. ఇది చాలా పవిత్రమైన బావి. అందుకే దీనిని సఫాయి బావి అంటారు. ఈబావి నీటితో స్నానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈబావిలోని నీటిని తమ పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని ఇక్కడి భక్తులు బావిస్తుంటారు.
సిఫాయి బాబా…
సైదులు బాబా సేనాని సిఫాయి బాబాకు ప్రత్యేక సమాది నిర్మించాడు. ఆయన సమాది చుట్టూ సైన్యం సమాదులు ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు సమాది చుట్టూ ఉన్న గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. తమ కోర్కెలు తీరిన వెంటనే వచ్చి ఇక్కడ కందూరు చేసుకుని తాళ్ళాలు తీయడం అనాదిగా వస్తున్న ఆచారం.
గొల్లబామ గుట్ట….
జాన్‌పహాడ్ షహీద్ బాబాకు వజీరాబాద్ రాజుకు జరిగిన యుద్ద సమయంలో ఒక గొల్లభామ రావిపహాడ్ గ్రామం నుండి వజీరా బాద్ వెలుతూ అటుగా వచ్చింది. ఆ యుద్ద దృశ్యాన్ని చూస్తూ వెళ్తూ ఆమెకు జాన్‌పహాడ్ సైదులు బాబా ఒక హెచ్చరిక చేశారు. అమ్మాయి చూసినంత చూశావు ఇక నీవు వెనకకు చూడకుండా వెళ్ళిపో…. ఒక వేళ నువ్వు వెనకకు చూశావో అక్కడే శిల అయిపోతావు అని సైదులు బాబా హెచ్చరించాడు. అది విన్న గొల్లభామ ముందుకు సాగిపోతూ కొంత దూరం వెళ్ళాక యుద్దం ఎలా జరుగుతుందో చూడాలనుకుంది. ఆతృతను అదుపు చేసుకోలేక వెనకకు తిరిగి చూసింది. అంతే ఆమె శిలగా మారిపోయిందని పెద్దలు చెబుతుంటారు. గొల్లబామ శిల అయిన ప్రాంతాన్ని భక్తులు గొల్లభామ గుట్టగా భావించి నమస్కరిస్తారు. వచ్చిన భక్తులు తలా ఒక రాయిని ఆమెకు సమర్పించి స్మరిస్తుంటారు. దర్గాను దర్శించిన భక్తులు గొల్లభామ గుట్టను చూసి వెళ్తుంటారు.
కందూరు….
జాన్‌పహాడ్ దర్గా వద్దకు ప్రతీ శుక్రవారం దర్శనానికి వచ్చే వారు,ఉర్సుకు వచ్చే వారు అక్కడ తీర్చుకునే మొక్కులను కందూరు అంటారు. కందూరు మొక్కులో మేకపోతు, గొర్రె పొట్టేలును నివేదంగా ఇవ్వడం ఆచారంగా వస్తుంది. భక్తులు తమ మొక్కు ప్రకారం మేక,పొట్టేలును తీసుకొచ్చి వాటికి స్నానం చేయించిన అనంతరం అలాల్ చేయిస్తారు. సఫాయి బావి నీటితో వండి దర్గాలో నివేదన(ఫాయితాలు) ఇచ్చి దర్శనంతో పాటు మొక్కు చెల్లించుకుంటారు. ఆ తర్వాత బంధు మిత్రులకు భోజనాలు పెడతారు. ఇలా చేస్తే చాలా పవిత్రమైనదని, మహిమాన్వితమైనదని భక్తులు భావిస్తుంటారు.
పంచపహాడ్‌లు…..
జాన్‌పహాడ్ కేంద్రంగా మరో నాలుగు పహాడ్‌లు ఉన్నాయి. ఇవి జాన్‌పహాడ్, గుండ్లపహాడ్, శూన్యపహాడ్, గణేష్‌పహాడ్, రావిపహాడ్‌లు . ఇవి పంచభూతాలకు సంకేతాలా…..లేక బారతీయ ధర్మంలోని పంచాయతన దేవారాధనకు సంకేతాలా అనే చర్చ కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News