హైదరాబాద్: ఇప్పటికే అనేక ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో పురస్కారం చేరింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘జపాన్ అకాడమీ’ అవార్డు గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 10న అవార్డు ప్రదానం చేయనున్నారు.
ఇప్పటికే జపాన్ బాక్సాఫీస్ వద్ద 40 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా కూడా రికార్డుల్లో నిలిచింది ఆర్‌ఆర్‌ఆర్. గతేడాది జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి, లీడ్ యాక్టర్లు రాంచరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ తో హోరెత్తించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్ర పోషించాడు. అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు రాబట్టి గ్లోబల్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది.