వజీమా ( జపాన్ ): వారం రోజుల కిందట జపాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 161కి చేరింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 565 మందికి పైగా గాయాల పాలయ్యారు. 200 మందికి పైగా ఆచూకీ దొరకలేదు. ఫైర్‌ఫైటర్స్, పోలీస్‌లు సోమవారం శిధిలాలలో ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోఅని వెతుకుతున్నారు. మృతుల వివరాలకు సంబంధించి వజీమాలో 70 మంది, సుజులో 70 మంది, అనామిజులో 11 మంది, మిగిలినవారు నాలుగు పట్టణాలకు చెందినవారు.
1390 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 30 వేల మంది స్కూళ్లు, ఆడిటోరియంలు, ఇతర ఖాళీ భవనాల్లో తలదాచుకొంటున్నారు. కొవిడ్ వంటి మహమ్మారి వ్యాధులు వ్యాపిస్తాయేమోనని భయపడుతున్నారు. నిర్వాసితుల్లో ఒక్కొక్కరికి రోజుకు ప్రాథమికంగా బ్రెడ్, మంచినీళ్లు మాత్రమే అందిస్తున్నారు. సైనికులు తాత్కాలిక స్నాన సదుపాయాలు ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరం రోజునే ఈ విషాదం జరగడంతో ఇంకా చాలా మంది ఆ విషాదాన్ని తలచుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు.