టోక్యో : జపాన్ ప్రయోగించిన తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. తాజా విజయంతో చంద్రుడి పైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.50 గంటల ప్రాంతంలో చంద్రుని ఉపరితలానికి చేరింది. వ్యోమనౌక లోని లూనార్ ఎక్స్‌కర్షన్ 1,2 అనే రెండు రోవర్లు చంద్రుని ఉపరితలానికి చేరుకున్నాయని, వాటి నుంచి డేటా భూమికి అందుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అయితే ల్యాండర్ లోని సౌర ఫలకాల్లో ఇబ్బంది తలెత్తడం వల్ల అవి విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని, “స్లిమ్” ( సాఫ్ట్ ల్యాండింగ్ ఫర్ ఇన్వెస్టింగ్ మూన్ ) ప్రస్తుతం బ్యాటరీలపైనే పనిచేస్తోందని చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో స్లిమ్ నింగిలోకి బయలుదేరింది. దీని ద్వారా సరికొత్త ల్యాండింగ్ పరిజ్ఞానాన్ని జపాన్ పరీక్షిస్తోంది. అనుకున్న ప్రాంతంలో అత్యంత కచ్చితత్వంతో దిగడానికి ఈ సాంకేతికత తోడ్పడుతుంది. ఈ టెక్నాలజీ సాఫీగా పనిచేసిందా, నిర్దేశించిన ప్రాంతంలోనే వ్యోమనౌక దిగిందా అన్నది ఇంకా వెల్లడి కాలేదు.