టోక్యో: ఓ వైపు జపాన్ భారీ భూకంపం తాకిడికి చిగురుటాకులా వణికి పోతుండగా మరో వైపు మంగళవారం టోక్యో విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెఎఎల్516 విమానం టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో మంటలు మొత్తం విమానాన్ని వ్యాపించాయి. ఈ ఘటనపై జపాన్ ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందిస్తూ విమానం రన్‌వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టుగార్డు విమానాన్ని ఢీకొట్టినట్లు భావిస్తున్నామని జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కెకు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. భూకంప ప్రాంతాల్లో బాధితులకు సహాయక సామాగ్రిని తీసుకు వెళ్తున్న వీరు మృత్యువాత పడడం విషాదకరం. హొక్కైడో విమానాశ్రయంనుంచి వచ్చిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రమాద సమయంలో 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
వీరిలో ఎనిమిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ క్షేమంగా బయటికి తీసుకువచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే ఎంతమంది గాయపడ్డారో మాత్రం తెలియరాలేదు. కోస్టుగార్డు విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో ఒకరు బయటపడగా, మిగిలిన ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదని ఎన్‌హెచ్‌కె తెలిపింది. ఒక్కసారిగా మంటలు తీవ్రం కావడంతో లోపలికి వెళ్లి వెతకడం విమానాశ్రయ సిబ్బందికి కూడా సాధ్యం కాలేదు. తాజా ఘటనతో హనెడా విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.దాదాపు 70 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.ఈ ఘటనపై జపాన్ ప్రధాని కిషిదా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. జపాన్‌లో ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడం గత మూడు దశాబ్దాల్లో ఇదే ప్రథమం.
చివరిసారిగా 1985లో జెఎల్‌కు చెందిన జంబోజెట్ విమానం టోక్యోనుంచి ఒసాకా నగరానికి వెళ్తుండగా గున్మా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో 520 మంది చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి.