టోక్యోలో జపాన్ అధికార పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ‘మంటలు రాజేసే బాంబులు’ (ఫైర్‌బాంబులు) పెక్కింటిని ఒక వ్యక్తి శనివారం విసిరినట్లు, ఆ తరువాత అతను తన కారుతో ప్రధాని నివాసం కంచెలోకి దూసుకువెళ్లినట్లు టోక్యో పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికైనా గాయాలు తగిలినట్లుగా సమాచారం లేదు. అతనిని అత్సునోబు ఉసుడా (49)గా పోలీసులు గుర్తించారు. అధికార విధుల నిర్వహణను అడ్డుకున్నాడన్న అభియోగాలపై అతనిని వెంటనే అరెస్టు చేశారు. ఆ తరువాత అదనపు అభియోగాలు చేర్చవచ్చు. దాడికి లక్షం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.
కానీ జపాన్ చట్టం కింద కార్యాలయం నిర్వహణకు కావలసిన డబ్బు గురించి ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఉసుడాకు చెందినవిగా భావిస్తున్న సోషల్ మీడియా పోస్ట్‌లను జపనీస్ మీడియా వార్తలు ప్రస్తావించాయి. ఉసుడాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని ఆ వార్తలు సూచిస్తున్నాయి. అణుశక్తి ప్లాంట్లకు వ్యతిరేకంగా నిరసనల్లో ఉసుడా పాల్గొన్నట్లుగా గుర్తు తెలియని వర్గాలను ఉటంకిస్తూ మీడియా వార్తలు పేర్కొన్నాయి. ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు ఉసుడా వెంటనే అందుబాటులోకి రాలేదు.