భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం జాసన్ గిలెస్పి విమర్శలు గుప్పించాడు. భారత బి జట్టు కూడా పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తుందని గవాస్కర్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ మాజీ కోచ్ గిలెస్పి విరుచుకుపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ అజేయ జట్టేమీ కాదన్నాడు. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన సిరీస్‌లలో చిత్తుగా ఓడిన విషయాన్ని గవాస్కర్ గుర్తుంచుకోవాలన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ బాగానే ఆడినా అదృష్టం కలిసి రాలేదన్నాడు.
ఐపిఎల్ పుణ్యమా అని భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారన్నాడు. డబ్బులు పుష్కలంగా లభిస్తుండడంతో భారత్‌లో చాలా మంది క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారన్నాడు. పాకిస్థాన్ వంటి పేద దేశంలో ఇలాంటివి సాధ్యం కావన్నాడు. అందుకే పాకిస్థాన్‌లో అగ్రశ్రేణి క్రికెటర్లు తయారు కావడం లేదన్నాడు. అయితే రానున్న రోజుల్లో పాకిస్థాన్ మళ్లీ పూర్వవైభవం సాధించడం ఖాయమన్నాడు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ప్రపంచ క్రికెట్‌లో పాక్ కూడా మెరుగైన జట్టుగా ఎదగడం ఖాయమని గిలెస్పి జోస్యం చెప్పాడు.