దుబాయి: సన్‌రైజర్స్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై వేటు పడింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. ఈ సీజన్ ఆరంభంలో హైదరాబాద్‌కు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే జట్టు వరుస ఓటముల తర్వాత అతన్ని కెప్టన్సీ నుంచి తొలగించి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తొలి దశలో జరిగిన కొన్ని మ్యాచుల్లో వార్నర్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇక రెండో దశ మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఓపెనర్ బెయిర్‌స్టో దూరమయ్యాడు. దీంతో వార్నర్‌కు తొలి రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా అవకాశం లభించింది. కానీ వార్నర్ మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే డకౌటయ్యాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. ఈసారి రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన జేసన్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు. గతంలో కూడా వార్నర్‌కు బదులు రాయ్‌ను సన్‌రైజర్స్ ఓపెనర్‌గా బరిలోకి దింపింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించింది.
ఒకప్పుడూ హైదరాబాద్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన వార్నర్ ప్రస్తుతం కనీసం తుది జట్టులో స్థానం కూడా పొందలేని స్థితికి పడిపోయాడు. దీనికి అతని పేలవమైన ప్రదర్శనే కారణమని చెప్పక తప్పదు. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో వార్నర్ విఫలమయ్యాడు. దీంతో అటు కెప్టెన్సీతో పాటు ఇటు తుది జట్టులో కూడా స్థానాన్ని కోల్పోక తప్పలేదు. ఈ సీజన్‌లో వార్నర్‌కు మరో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. రాయ్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తేనే వార్నర్‌కు మరోసారి బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సన్‌రైజర్స్‌లో వార్నర్ ప్రస్థానం దాదాపు ముగిసినట్టే. వచ్చే సీజన్‌లో రెండు ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఇక బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లి ప్రకటించాడు. ఈ పరిస్థితుల్లో వార్నర్‌ను తీసుకుని అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో బెంగళూరు యాజమాన్యం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక వార్నర్ కూడా హైదరాబాద్ జట్టులో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Jason Roy replace David Warner in IPL 2021