Friday, November 15, 2024

నేనే అతన్ని వెతుక్కుంటూ వెళ్లా

- Advertisement -
- Advertisement -

Jatiratnalu movie in Tollywood

 

ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాలతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

హిలేరియస్ సినిమా చేద్దామని…

ఈ సినిమా కథను డైరెక్టర్ వచ్చి నాకు చెప్పలేదు. అనుదీప్ చేసిన ఒక కామెడీ షార్ట్ ఫిలిం నచ్చి నేనే అతన్ని వెతుక్కుంటూ వెళ్లాను. నాకు జంధ్యాల, ఎస్.వి.కృష్ణారెడ్డి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే అలాంటి ఒక హిలేరియస్ సినిమా చేద్దామని అనుదీప్‌ని కలిశాను. అతను చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఈ సినిమా చేశాం.

వీళ్లే జాతిరత్నాలు అనిపించింది…

అనుదీప్ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు నవీన్ అయితే బాగుంటుందని అనిపించింది. అలాగే మిగతా పాత్రలకు రాహుల్, ప్రియదర్శిలు సరిపోతారని తీసుకున్నాం. వారిని చూడగానే వీళ్లే మా జాతిరత్నాలు అనిపించింది. ఇక నవీన్ ఎలాంటి రోల్ అయినా చేయగలడు. కామెడీ అయితే డిఫరెంట్ లెవెల్‌లో చేశాడు. అలాగే రాహుల్, ప్రియదర్శి కూడా బాగా చేశారు.

కామెడీ ఎంటర్‌టైనర్…

రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుకునే సినిమా ఇది. కథ విషయానికి వస్తే… ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది.

అతనికి మంచి హార్ట్ ఉంది…

ఒక స్క్రిప్ట్ రాయాలన్నా… సినిమా తీయాలన్ని బ్రెయిన్ కావాలి. కానీ మంచి కామెడీ మూవీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్‌కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్‌గా వచ్చింది.

అది కొత్త తరహా చిత్రం…

ప్రభాస్‌తో నేను చేస్తున్న సినిమా ఒక కొత్త తరహా చిత్రం. స్క్రిప్ట్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకు కావాల్సిన ప్రపంచాన్ని సృష్టించడానికి కొంత సమయం పడుతుంది. జూలై నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News