జట్రోఫా మొక్కల విత్తనాలను ఇంధనంగా మార్చి జెట్ విమానాల ఇంజన్లను నడిపించడంలో శాస్త్రవేత్తల బృందం కొన్నేళ్ల ప్రయత్నం ఫలించింది. డెహ్రాడూన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపి) క్యాంపస్‌లో ఈమేరకు ప్రయోగాలు కూడా నిర్వహించారు. 40 శాతం చమురు పదార్ధాలు కలిగిన జట్రోఫా నుంచి 330 కిలోల జీవ ఇంధనం (జెట్ ఫ్యూయెల్)ను తయారు చేయగలిగారు. ఇదే ఇంధనంతో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వరకు 45 నిమిషాల సేపు జెట్ విమానాన్ని నడపగలిగారు. జట్రోఫా నుంచి ఈ విధంగా చమురును సేకరించడానికి ఐఐపి బృందానికి నాలుగు రోజులు పట్టింది.
విమానంలో కుడివైపున ఇంజిన్‌కు దీన్ని వినియోగించారు. ఈ ప్రయోగాత్మక విమానంలో 25 శాతం మాత్రమే బయోజెట్ ఇంధనం వినియోగించగా, మిగతాది సంప్రదాయ విమాన టర్బయిన్ ఇంధనం (ఎటిఎఫ్) . అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి ఇంజిన్‌లో 50 శాతం వరకు బయోజెట్ ఇంధనం వాడవచ్చు. 400 రకాల మొక్కల విత్తనాల నుంచి జీవ ఇంధనం లభిస్తుంది. అయితే చత్తీస్‌గఢ్ బయోఫ్యూయెల్ డెవలప్‌మెంట్ అధారిటీ నుంచి జట్రోఫా వెంటనే లభిస్తున్నందున శాస్త్రవేత్తలు ఇంధనం తయారీకి జట్రోఫానే ఎంచుకున్నారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో దాదాపు 500 మంది వ్యవసాయదారులు ఈ జట్రోఫాను పండిస్తున్నారు. దీంతో ఆ రైతుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. విమానాల్లో సాధారణంగా కిరోసిన్ ఆధారిత ఇంధనాలను వినియోగిస్తుంటారు.
ఇవి కాలుష్య వ్యాప్తి కారకాలు. అయితే ఇటువంటి ఇంధనాలను విమానాలు ఉపయోగించడంతో విమాన సర్వీస్‌ల వల్ల వాతావరణంలో 4.9శాతం వరకు మార్పు కనిపిస్తోందని, ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి) , వరల్డు మెటియొరాలజీ ఆర్గనైజేషన్ (డబ్లుఎండిఒ) అభిప్రాయ పడుతున్నాయి. ఎటువంటి హైడ్రోకార్బన్ ఇంధనమైనా, టన్ను ఇంధనం మండితే 3.15 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అదే మొక్క నుంచి వచ్చే ఇంధనం అయితే కార్బన్ ఉద్గారాలు విడుదలైనవాటికీ, వాతావరణం నుంచి మొక్కలు గ్రహించే కార్బన్‌కు సమానంగా ఉంటాయి.
వందశాతం బయోజెట్ ఇంధనాన్ని విమానాల్లో వినియోగిస్తే కార్బన్ ముద్ర 50 నుంచి 80 శాతం వరకు తగ్గుతుంది. మరో ప్రయోజనం ఏమంటే వాయు కాలుష్యం తగ్గుదల, సంప్రదాయ విమాన ఇంధనం మిలియన్‌కు 3000 పార్టుల సల్ఫర్ ఉంటుంది. దాని నుంచి సల్ఫర్‌డైయాక్సైడ్ విడుదల అవుతుంది. అదే బయోజెట్ ఇంధనం అయితే మిలియన్‌కు 10 పార్టుల కన్నా తక్కువే సల్ఫర్ ఉంటుంది. వంటగ్యాస్ ఇంధనాన్ని కూడా బయో ఇంధనంగా మార్చి విమానాలకు, ఆటోమొబైల్ వాహనాలకు వినియోగించాలని చూస్తున్నారు.