5న పూరీ వద్ద తీరానికి…
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘జవాద్’ తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు ఈ తుపాను చేరనుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర తెలిపారు. ఆ తర్వాత అది ఉత్తరంఈశాన్యం దిశలో కదలి డిసెంబర్ 5న పూరీ తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అండమన్ సముద్రంలో నవంబర్ 30న అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత అది మరింత తీవ్రమై డిసెంబర్ 2న వాయుగుండంగా మారింది. శుక్రవారం ఉదయం నాటికి అది తీవ్ర వాయుగుండంగా మారింది. చివరికి శుక్రవారం మధ్యాహ్నం కల్లా అది తుపానుగా మారిపోయిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా దక్షిణ కోస్తాలో శుక్రవారం సాయంత్రంకల్లా భారీ వర్షాలు పడనున్నాయి.
ఈ వర్షపాతం శనివారం కల్లా మరింత భారీగా మారనుందని కూడా ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో శనివారానికి ఎర్ర రంగు హెచ్చరికను జారీచేశారు. ఈ ఎర్ర రంగు హెచ్చరికను ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాలకు కూడా జారీ చేశారు. పశ్చిమ బెంగాల్లో శనివారం, ఆదివారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం, సోమవారం అస్సాం, మేఘాలయ, త్రిపురలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నౌకాయానానికి, చేపలు పట్టేందుకు సముద్ర వాతావరణం అనుకూలంగా లేదని, కేంద్ర, ఉత్తర బంగాళాఖాతం మత్సకారులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర కోస్తాంధ్ర తీరంలో, ఒడిశా తీరంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి గంటకు 65 కిమీ. వేగంతో ఈదురు గాలలు వీచే అవకాశం ఉందని, శనివారం సాయంత్రానికల్లా ఈ ఈదురుగాలులు గంటకు 100 కిమీ. వేగంతో వీచేంత తీవ్రంగా మారుతాయని వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరించింది. జవాద్ తుపానును ఎదుర్కొనే సంసిద్ధతను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం, వారున్న ప్రదేశం నుంచి ఖాళీ చేయించడం వంటి విషయాల్లో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యుత్తు, టెలికమ్యూనికేషన్స్,ఆరోగ్యం, త్రాగునీరు వంటి వాటికి ఏదైనా అంతరాయం ఏర్పడితే వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర ఔషధాలను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని కూడా ఆయన ఆదేశించారు.