మనతెలంగాణ/హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక శనివారం మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు గత 14 సంవత్సరాలుగా మిలటరీలో జవానుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం జమ్మూ-కశ్మీర్‌లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్డప్పనాయుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సహచరులు ఆయనకు ప్రథమ చికిత్సను అందించినప్పటికీ ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులు హెలీకాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రెడ్డప్పనాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాతిక్వ్, కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు రెడ్డప్పనాయుడుకు ఇటీవల పదోన్నతి లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబానికి ఇంతటి చేదు వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రేపు స్వగ్రామానికి మృతదేహం:
కాశ్మీర్‌లో మృతి చెందిన రెడ్డప్పనాయుడి మృతదేహం మంగళవారం గడ్డ కిందపల్లికి చేరుకోనుందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగకు సెలవుపై వస్తానన్న తన కుమారుడు విగత జీవిగా మారాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నారు. రెడ్డప్ప మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Jawan dies of severe cold in Kashmir