Tuesday, November 5, 2024

రక్షణ కల్పించండి సారూ..! హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన జవాను తల్లి

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా అడ్డుకున్నందుకు తమను చంపుతామని కొందరు రియల్టర్లు బెదిరిస్తున్నారని నల్గొండ జిల్లా కూర్మపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 8న కొందరు తన భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమ కుమారులు దేశ సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, కబ్జా దారుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని శ్రీశైలమ్మ కోరింది. తన భర్త పెద్ద రామచంద్రం యాదవ్ ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా హరితహారం మొక్కలను నాటితే కూర్మపల్లి గ్రామానికి చెందిన కబ్జాదారులు ఆయనపై దాడి చేశారని శ్రీశైలమ్మ హెచ్‌ఆర్‌సికి వివరించింది.

ఈ ఘటనకు సంబంధించి స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు దాడికి పాల్పడిన వారితో కుమ్మకై తమపైనే అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపింది. తన ముగ్గురు కొడుకులలో ఇద్దరు సైన్యంలో పని చేస్తున్నారన్న ఆమె… అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తన భర్త చావుబతుకుల మధ్య పోరాడుతున్నారని కన్నీరు పెట్టుకుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కమిషన్‌ను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News