Wednesday, January 22, 2025

జయాబచ్చన్ వర్సెస్ ధన్‌కర్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎగువసభ రాజ్యసభలో శుక్రవారం తీవ్రస్థాయిలో అసాధారణ పరిస్థితి నెలకొంది. సమాజ్‌వాది పార్టీ ఎంపి జయాబచ్చన్‌కు ఉపరాష్ట్రపతి, సభాధ్యక్షులు జగదీప్ ధన్‌కర్‌కు మధ్య పేరు విషయంలో వాడివేడిగా వాదన జరిగింది. ఇంతకు ముందు అభ్యంతరం తెలిపినప్పటికీ సభాఛైర్మన్ తనను పదేపదే జయా అమితాబ్ బచ్చన్ అని గట్టిగా సంబోంధించడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన పట్ల అవహేళన రీతిలో ధన్‌కర్ హావభావాలు ఉన్నాయని, తనను గద్ధిస్తున్నట్లుగా ఆయన మాట్లాడారని పేర్కొంటూ జయాబచ్చన్ నిరసన వ్యక్తం చేశారు. జయా బచ్చన్‌కు కాంగ్రెస్ అధినేత్రి , ఎంపి సోనియా గాంధీ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. సోనియా గాంధీ నాయకత్వంలో వాకౌట్‌కు దిగారు. ఈ దశలో ధన్‌కర్ స్పందిస్తూ ప్రతిపక్షాల వైఖరి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో గదమాయింపే పెద్దరికమా
అంతకు ముందు సభలో జయాబచ్చన్ మాట్లాడుతూ ధన్‌కర్ సభకు పెద్దగా వ్యవహరించడం లేదని , తన పెద్దరికం ప్రదర్శించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అరిచినట్లుగా మాట్లాడాన్ని వ్యతిరేకించారు. దీనిపై ధన్‌కర్ స్పందిస్తూ ‘ ‘ మీరు నాకు పాఠాలు నేర్పుతారా? , మరో పెద్ద సెలబ్రిటీ కావచ్చు, అయితే ఏం మీరు ఖచ్చితంగా సభా మర్యాద పాటించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. తనను ధన్‌కర్ మాట్లాడనివ్వకపోవడం, పైగా ప్రతిపక్ష నేత ఖర్గే మైక్ కట్ చేయడం నిరంకుశం అని జయాబచ్చన్ కోపోద్రిక్తులయ్యారు.

బిజెపి సభ్యుడి వ్యాఖ్యలే గొడవకు మూలం
గత వారం బిజెపి సభ్యులు ఘనశ్యామ్ తివారీ ఖర్గే గురించి అనుచిత వ్యాఖ్యలకు దిగారని, ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టిన క్రమంలో సభలో గందరగోళం తరువాత రాజ్యసభ అధ్యక్షులకు , ప్రతిపక్షాలకు మధ్య వ్యాగ్యుద్ధానికి దారితీసింది. పోయిన వారం సంగతి ఇప్పుడెందుకు? అయినా తన ఛాంబర్‌లో దీనిపై అందరి మధ్య సయోధ్య కుదిరిందని ధన్‌కర్ తెలిపారు. పైగా తివారీ సభలో ప్రతిపక్ష నేతను ప్రశంసించారని చెప్పారు. తివారీ విషయంపై మాట్లాడటానికి వీల్లేదని, దీనిపై ఎవరిని అనుమతించేది లేదని ఆయన ఖర్గే మైక్ కట్ చేశారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సభాధ్యక్షుల తీరు ఆయన మాట్లాడే పద్ధతి బాగా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. డిఎంకె సభ్యులు తిరుచి శివ ఈ విషయం ప్రస్తావించారు. ఈ దశలో తాను కూడా దీనిపై మాట్లాడుతానని జయా బచ్చన్ తెలిపారు. ఈ దశలోనే ధన్‌కర్ ఆమెను నమోదిత పేరు జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడం వివాదానికి మూలమైంది.

కుర్చీలో కూర్చుని బెదిరింపులా ః జయా
మీరు పద్థతి తెలియచేస్తారా ః ధన్‌కర్
తాను కళాకారిణిని అని ఇతరుల హావభావాలను అర్థం చేసుకుంటానని , నొసలు చిట్లించి మాట్లాడటం ఈసడించుకున్నట్లు వ్యవహరించడం అన్ని తెలుసుకుంటానని జయాబచ్చన్ ధన్‌కర్‌పై దాడికి దిగారు. మీ గొంతుచించుకునే పద్ధతి బాగా లేదని చెప్పడానికి చింతిస్తున్నానని అన్నారు. మనమంతా సభలో సహచరులమని, ఇప్పుడు మీరు కుర్చీలో ఉండొచ్చు అంతే తేడా అన్నారు. దీనిపై ధన్‌కర్ ఆగ్రహంతో ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వచ్చారా. ఇక చాలించండి అని గదమాయించారు. మీరు యాక్టర్ కావచ్చు. డైరెక్టర్ చెప్పినట్లు చేయాల్సిందే. ఈ స్థానం నుంచి నిర్వహణ ఏమిటనేది మీకు తెలియదన్నారు. ఎంతోదూరం పయనించి ఇక్కడికి చేరిన నన్ను పెద్దగా మాట్లాడవద్దని అంటారా? అని ఎదురుదాడికి దిగారు. ఆయనకు ప్రతిపక్షాలు అడ్డుతగిలాయి. దీనిని పట్టించుకోకుండా ధన్‌కర్ ఇక్కడికి వచ్చిన వారు ఇంతకు ముందు సముపార్జించుకున్న గౌరవాలను ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చింది అంతా గౌరవం పెంచుకోవడానికి అని తెలిపారు.

సీనియర్ అయితే ఛెయిర్‌ను కించపర్చవచ్చా?
ఈ దశలో టిఎంసి ఎంపి సుష్మితా దేవ్ కలుగచేసుకుని జయాబచ్చన్ ఈ సభలో ఎంపి, ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందే అన్నారు. దీనిపై సభాధ్యక్షులు స్పందిస్తూ సీనియర్ సభ్యులు అయితే ఛెయిర్‌ను అవమానించే విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. తనకు ఎవరూ ఏమి చెప్పాల్సిన పనిలేదని తన పద్థతి ప్రకారం తాను వెళ్లుతానని చెపుతూ ప్రతిపక్షాల మాటలు రికార్డుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఖర్గేను ఉద్ధేశించి మీ హంగామాతో ఒరిగేదేమీ లేదన్నారు.

దేశాన్నే అస్థిరపర్చే రకాలు
ఈ దశలో ప్రతిపక్షాలు వాకౌట్‌కు దిగుతూ ఉండగా వారిని ఉద్ధేశించి సభాపతి మీరు అంతా ఈ దేశాన్నే అస్థిరపర్చదల్చుకున్నారు. ఈ సభ మీకో లెక్కా ? ఇక్కడ కూడా ఇదే పద్థతికి దిగుతున్నారని, అయితే మీ చేష్టలకు ఈ సభను ప్రకంపనల కేంద్రం చేయనిచ్చేది లేదన్నారు. ఖర్గే వైపు చూస్తూ మీ పద్ధతి రాజ్యాంగాన్ని దెబ్బతీసేదిగా ఉంది. ఓ సభా మర్యాద లేదని, పద్ధతి లేదని అంటూ ఇదంతా కూడా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల దురుసు వ్యవహారమే అవుతుందన్నారు. బిజెపి సభ్యులు తివారీ ఖర్గేకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. బిజెపి సభ్యుడు పార్లమెంటరీ పరిబాషలోనే మాట్లాడారని, ఖర్గేను ప్రశంసించారని, అయినా దీనిపై రాజీ కుదిరింది కదా అని తెలిపారు. ఛాంబర్‌లో ఏమి చెప్పారో ఉన్నదున్నట్లుగా చెపుతారా అని ఖర్గే ధన్‌కర్‌ను ప్రశ్నించారు. అటువంటి అవసరం లేదని ఖర్గే చెప్పిన దశలోనే విపక్షం సభ నుంచి వాకౌట్ జరపడంతో సభ అర్థాంతరంగా చాలా వేడిగా వాడిగా ముగిసిపోయింది. ఈ దశలోనే సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News