Sunday, January 19, 2025

పార్టీలలో గందరగోళానికి బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఎల్‌డి తమవైపే అన్న ఎస్‌పి

లక్నో : బిజెపి పలు విధాలుగా అరాజకీయాలకు పాల్పడుతోందని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ విమర్శించారు. ఆర్‌ఎల్‌డి నేత జయంత్ చౌదరి బిజెపిలో చేరుతారనే ప్రచారంపై యాదవ్ బుధవారం స్పందించారు. ఇతర పార్టీల పట్ల ప్రజలలో అయోమయం, నేతలలో గందరగోళం సృష్టించేందుకు కాషాయ పార్టీ పలు విధాలుగా పావులు కదుపుతోందని, జయంత్ చౌదరి బిజెపిలో చేరడం లేదని, ఇండియా కూటమిలోనే ఉంటారని శివపాల్ యాదవ్ స్పష్టం చేశారు. జయంత్ ఎక్కడికి వెళ్లడం లేదు.

తమతోనే ఉంటారని శివపాల్ యాదవ్ చెప్పారు. యుపిలో కొంత మేరకు రాజకీయ ప్రాబల్యం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ వైపు వెళ్లుతోందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ఎస్‌పి నేతలు శివపాల్ , అఖిలేష్ యాదవ్‌లు స్పందించారు. ఇటువంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సంక్షేమానికి లౌకిక ప్రజాస్వామిక పార్టీలు పాటుపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఆయన ఎప్పుడూ వ్యవహరించబోరని ఇద్దరు నేతలు తెలిపారు. జయంత్ లౌకికవాది.

ఆయన వేరేగూటిని వెతుక్కునే ప్రసక్తే లేదని సీనియర్ నేత శివపాల్ చెప్పారు. విద్యావంతుడు, అర్థం చేసుకునే వ్యక్తి పట్ల బిజెపి అపార్థాలు ఏర్పడేలా చేస్తోందని అఖిలేష్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పొత్తులు ఆరంభమయ్యాయి. ఆర్‌ఎల్‌డి, ఎస్‌పిలు ఈ నేపథ్యంలో మిత్రపక్షాలుగా ఉంటాయని స్పష్టం అవుతోంది. తమ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి ఎన్ని ఎత్తుగడలకు దిగినా ఫలితం ఉండదని, తమది ఒకటే బాట అని సమాజ్‌వాది పార్టీ నేతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News