న్యూఢిల్లీ: గత కొన్నేళ్లలో వచ్చిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలన్నిటినీ భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడగలిగిందని ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఆదివారం అన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లోనూ ఎలాంటి సవాళ్లు ఎదురైనా భారత్ సమర్థవంతంగా అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024లో ద్రవ్యోల్బణం తగ్గి, బలమైన వృద్ధి నమోదవుతుందని వర్మ అంచనా వేశారు.గత ఏడాది అనూహ్యంగా పెరిగిన ఆహార పదార్థాల ధరలు క్రమేపీ దిగొచ్చాయని గుర్తు చేశారు. 2024లోనూ అవి దిగువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో అవలంబించిన సరళ ద్రవ్య పరపతి విధానాలే ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకు కారణమని వివరించారు.
తర్వాత సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఇబ్బందులు సమస్యను మరింత తీవ్రం చేశాయన్నారు.ఆ సవాళ్లలో ఏవీ ఇప్పుడు లేవన్నారు. కరోనా మహమ్మారినుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరఫరా వ్యవస్థలో సమస్యలు, రష్యాఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్‌హమాస్ ఉద్రిక్తత, చమురు ధరల పెరుగుదల, ఇటీవల ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు.. ఇలా వరసగా సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. వీటన్నిటినీ తట్టుకొని భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది.