Monday, January 20, 2025

ఆకుపచ్చని సంతకం జయరాజు

- Advertisement -
- Advertisement -

జయరాజుది ప్రకృతి తత్వం, పర్యావరణ సాహిత్యం. ప్ర జల కవిత్వం. జయరాజు కవిత్వంలో అణువణువు పర్యావరణ స్పృహా గుభాళిస్తుంది. మానవుని స్వార్ధపూరి త చర్యల వల్ల పుడమితల్లి పడుతున్న వేదనను, ఆవేదనను ఆ యన ఆర్తిగా వింటాడు. ఆ ఆర్తిని అక్షరాల్లోకి అనువందించి అంతే ఆర్ధ్రంగా మనకు అందిస్తాడు. మానవ పరిణామక్రమం లో అమ్మగా అన్నీ అందించిన ప్రకృతిని వికృతిగా మారుస్తున్న ఆధునిక మానవుని చర్యలపై పాటై రగులుతాడు. జయరాజు సాహిత్యం ప్రకృతిలోని అందాలనే కాదు, అవసరమైనప్పుడు ప్రకృతి ప్రదర్శించే ఆగ్రహాన్ని కూడా మనకు అర్ధమయ్యేలా చే స్తుంది. భూమ్మీద జీవించే అన్ని జీవుల్లాగే మానవుడు కూడా ఒక జీవే, కానీ మానవుడి స్వార్ధం వల్ల కోట్లాది జీవరాశులు జీవించే హాక్కును కోల్పోతున్నాయని ఆవేదన చెందుతాడు. మానవుని ప్రగతిలో, పురోభివృద్ధిలో ఎంతో కీలక పాత్రను పో షించిన ఆ జీవరాశులు కనుమరుగైపోతే సంభవించే జీవన విధ్వంసం వల్ల చివరకి మనిషి కూడా కనుమరుగైపోయే ప్రమాదముందని హెచ్చరిస్తాడు. ఆ ప్రమాదాన్ని గుర్తించి తక్షణమే అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో మానవ మనుగడ మరింత ప్రమాదంలో పడుతుందని జయరాజు తన సాహిత్యంలో పదేపదే హెచ్చరిస్తాడు.

సృష్టిలోని ఏ జీవికి అర్ధం కాని, సాధ్యం కాని ఎన్నో ఆవిష్కరణలను ప్రకృతి మనకు అందిస్తుంది. మానవుడు మునుపెన్నడూ చూడని అందాల హరివిల్లును మన మనోనేత్రాల ముందు ఆవిష్కరిస్తుంది. తన తనువులోని అణువణువులో దాగిన అంతులేని తన సంతతకి జీవం పోసి సాధుకుంటుంది. తనే ఒక మహాగ్రంధమై ఏ మానవ మేధకీ అందని తాత్వికతను విడమరిచి చెబుతుంది. ప్రకృతి అందించిన ఆ ఆవిష్కరణలని దర్శించాలన్నా, ప్రకృతి అందించే ఆ తాత్వికత భోదపడాలన్నా మనిషిలోని మట్టి పరిమళాలను తట్టి లేపాలి. అప్పుడే మానవుడు ప్రకృతి బాషని అర్ధం చేసుకోగలుగుతాడు. మనిషిలో నిద్రాణమైన ప్రకృతి తత్వగ్రహణశక్తిని చైతన్య పరచడానికి అప్పుడప్పుడూ కొంతమంది తాత్వికులను ప్రకృతే ఎంపిక చేసుకుంటుంది. దాన్నే ‘ ప్రకృతి తాత్విక వరణం ’ అంటారు. అలా ప్రకృతి ఎంపిక చేసుకున్న మనకాలపు మహావాగ్గేయకారుడు జయరాజు. జయరాజు వాగ్గేయకారుడే కాదు, ప్రకృతి తత్వాన్ని, మట్టి పరిమళాలను ఎత్తి తనువంతా తలంటుగా పోసుకున్న మహాకవి. విశ్వవిద్యాలయాలకు సైతం అర్ధం కాని పర్యావరణ సిద్ధాంతాన్ని చిగురు చిగురు పదాలతో అందరికీ అర్ధమయ్యే రీతిలో ఆవిష్కరించే ఆకుపచ్చని వాగ్గేయకారుడు.

ప్రకృతి ప్రకోపిస్తే జరిగే విధ్వంసాన్ని అందరూ ఒక మహా ప్రళయంగా గుర్తిస్తే, అది మానవ ప్రవృత్తిలో రావాల్సిన మార్పు కోసం ప్రకృతి సైద్ధాంతీకరించిన నూతన విప్లవంగా అభివర్ణిస్తాడీ ఆకుపచ్చని సూరీడు. అభివృద్ధి అనే స్వార్ధం పొరలు కమ్మేసిన ఆధునిక మానవుని కళ్లకు కనిపించని ప్రకృతి జీవన దృశ్యాన్ని జయరాజు తన పత్రహరితం కళ్ళతో బంధించి తన సాహిత్యం ద్వారా మానవాళికి అందిస్తాడు.జయరాజు సాహిత్యమంటే కేవలం అక్షరాలతో నిర్మితమయ్యింది కాదు. దానిలో కన్నీళ్లుంటాయి. కలువపూలూ ఉంటాయి. నెమలి పిట్టల నాట్యమూ ఉంటుంది. మొత్తానికి మొత్తంగా జయరాజు సాహిత్యం పురివిప్పిన ప్రకృతి నృత్యంలా ఉంటుంది. జయరాజుకు ప్రకృతే కాదు, జీవులన్నా, మానవులన్నా అంతులేని ప్రేమ. ఆ ప్రేమ ఆయన ఆవిష్కరించే ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ఆరుద్ర పురుగు అందం గురించి రాసినా, సాలీడు అల్లిక నైపుణ్యం గురించి వివరించినా, అమ్మ చనుబాలులోని మాధుర్యం గురించి వినిపించినా జయరాజుకు జయరాజే సాటి. సాలీడు, నత్తగుళ్ల, రింగన పురుగు, చిలకల గుంపు, తేనేటీగలు,

తూనీగలు, పిచ్చికగూళ్లు, వడ్లపిట్ట, వలసపక్షులు, గొల్లభామలు, మిణుగురులు, గువ్వల జంట, తాబేల్లు, కప్పలు ఒకటా రెండా సమస్త జీవరాశి జయరాజు సాహిత్యంలో అందంగా ఒదిగి తమ కథలను, వ్యధలను విప్పి చెబుతాయి. అందరూ ప్రకృతిలోని అందాల్ని చూస్తే, జయరాజు ప్రకృతి అందాలతో పాటు అందులో చెలరేగుతున్న అలజడిని సైతం దర్శిస్తాడు. ఆ అలజడికి కారణమైన మానవుని విపరీత చేష్టలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ప్రాణాలు పోసే ప్రకృతే వికృతంగా మారి సమస్తాన్ని పొట్టన పెట్టుకుంటుందన్న సత్యాన్ని పదే పదే తన పాటల ద్వారా, మాటల ద్వారా మనందరికీ వివరిస్తాడు.జయరాజు సాహిత్యదృష్టి భిన్నమైనది. అవనిలో అణువణులో దాగిన అపూరపమైన అద్భుతాలను ఆద్యంతం దర్శించిన వాడు. ప్రకృతిలోని ప్రతి అంశాన్ని విభిన్నకోణంలో చూడటంతో పాటు, దాన్ని అక్షరీకరించటంలో కూడా ఆయన ఆ భిన్నత్వానికి తగిన రీతిలోనే ఆవిష్కరిస్తారు. కేవలం జీవులకే కాదు, నిర్జీవులు కూడా పర్యావరణంలో ఎంతో విలువైన పాత్ర పోషిస్తాయన్న అంశం జయరాజుకు తెలుసు.

రాయినయితే నేమిరా../ రప్పనయితే నేమిరా…/ ఎటికి ఎదురుగా నిలిచి జనుల/ కూటి భాదలు మాపినాను/ ఎల్లలోకములు కొలిచే / దేవుళ్లను చేసాను అని ప్రకృతిలో రాయి సైతం ఎంతటి విలువైన పాత్రను నెరవేరుస్తుందో ఆయన మన కళ్లకు కట్టినట్లు వివరిస్తాడు. వానమ్మ పాటలో ఋతువులు గతి తప్పిన క్రమాన్ని, వానకు, నేలకు ఉన్న పేగుబంధాన్ని చెబుతూనే వాతావరణంలో సంభవిస్తున్న విపరిణామాల వల్ల తెగిపోయిన ఆ పేగుబంధం వల్ల కలిగే కలిని, ఆకలిని అంతే ఆర్ధ్రంగా మనకు వినిపిస్తాడు.చేలల్లో నీళ్లూ లేవు/ చెలకల్లో నీళ్లు లేవు/ నిన్నే నమ్మిన రైతు కళ్లల్లో నీళ్లు లేవు అంటూ ఆవేదన చెందుతాడు./ పర్యావరణంలో ప్రతి జీవి తనకు మాత్రమే సొంతమైన పాత్రను, విశిష్టతను కలిగి ఉంటుందున్న సత్యం జయరాజుకి తెలుసు. చిన్న చిన్న రింగన పురుగులు సైతం పర్యావరణంలో ఎంతటి విలువైన పాత్రను పోషిస్తాయో వివరిస్తూ ‘ పువ్వులోని పుప్పొడిని, ప్రకృతిలోని మకరందాలను పువ్వు, పువ్వుకు వెదజల్లి పునరుత్పత్తికి జీవం పోస్తాయి’ అంటాడు. విశ్వంలోని అణువణువు తన మనో నేత్రంతో దర్శించిన ఈ మహావిద్వాంసుడు తన రచనా వైశిష్ఠ్యంతో మనకు

అందించే ప్రకృతి వింతలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేయటంతో పాటు ఆలోచింపచేస్తాయి.
సృష్టిలో మానవమేధకు అందని ఆవిష్కరణలు ఎన్నో ఉన్నాయి. మానవుడు చేపను చూసి పడవను తయారు చేసుకోవటం, పక్షిని గమనించి విమానాలను ఆవిష్కరించటం వంటి నిర్మాణాలకు పునాదులు ప్రకృతి నుండే గ్రహించాడు. ఇప్పటికీ, ఎప్పటికీ గిజిగాడు నిర్మాణ వైచిత్రి ఎవరికీ అర్ధం కాదు. పరిణామంలో చాలా చిన్నదైన ఒక పక్షి అంత అద్భుతంగా, అంత సురక్షితంగా, అంత సుందరంగా ఒక చిట్టి గూడును నిర్మించుకోవటం విస్మయాన్నే కాదు, విభ్రాంతిని కల్గిస్తుంది. ఆ విస్మయాన్నే జయరాజు తన అవని అనే గ్రంధంలో వ్యక్తీకరీస్తూ ‘ నాగరీక సమాజంలో ఏ ఇంజనీరుకీ లేని నైపుణ్యతతో ఈ గిజిగాడు గూడు అల్లిన తీరు ఆశ్చర్యపరుస్తుంది ’ అంటాడు. తన జీవితాన్నే వస్త్రంగా నేసి మానవునికి ఆహార్యంగా అందించిన సాలీడు నిపుణతను అభివర్ణిస్తూ ఇలా అంటాడు. ‘ ఏలేడంత లేని ఓ సాలీడు.. నేస్తున్నాడు ఏం చక్కంగా తన గూడు.. మనం కట్టే బట్టను నేసే నేతకు తాత వాడు..

చిన్న వాడు అయినా పనిలో మొనగాడు’ అంటాడు. చిన్న చిన్న చీమలు కూడా తమ ఆవాసాలను అద్భుతంగా నిర్మించుకోవటం జయరాజుకి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ‘ రెండు కొమ్మలకు చెందిన ఆకులను దగ్గరికి చేర్చి అందమైన ఆకుపచ్చని గూడును నిర్మించుకునే చీమల నిర్మాణ సంపత్తి ముందు మానవుడి జ్ఞాన సంపత్తి దిగదుడుపే’ అంటూ అంత చిన్న చీమలు అంత పెద్ద చెట్టుకొమ్మలను ఎలా ఒక్క దగ్గరకు చేర్చగలిగాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు.
ప్రకృతిలోని ప్రతి జీవి నిబద్ధతతో తనకు నిర్దేశించిన పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తేనే పర్యావరణ సమతుల్యతను సాధించగలుగుతాము. మానవుని స్వార్ధపూరిత చర్యల వల్ల అనేక జీవులు తమ మనుగడను కోల్పోతున్నాయి. నిండు వేసవిలో బీళ్లు నోళ్లు తెరిచిన నేల పగుళ్ల నుండి బయటికొచ్చి, మృదువైన జీవితాన్ని గడిపే నత్తగుళ్ళలు అత్యంత వేగంగా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు పొడిబారిన ఏ పంట పొలంలో చూసినా గుళ్లబారిన నత్తల కళేబరాలే కనిపిస్తాయి. పంటపొలాల్లో అవసరానికి మించి రసాయనాలు వాడటం వల్లనే నత్తగుళ్ళల వంటి వందలాది జీవరాశుల మనుగడ నేడు ప్రమాదంలో పడింది.

పురుగుల కొరకు చల్లిన రసాయనిక మందుల వల్ల పురుగు చావటం అటుంచి పక్షులు చావటం మొదలైంది. అలా మట్టికి జీవ పరిమళాలు అద్దే పురుగులు, ఆ పురుగులు మీద ఆధారపడిన పక్షులు, ఆ పక్షులను ఆహారంగా తీసుకుని జీవించే జీవులు ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి. జీవుల మధ్య ప్రకృతి అల్లిన అందమైన ఆహారపు గొలుసు తెగిపోతుంది. దీన్నే జీవావరణ విధ్వంసం అంటారు. నిరంతరం పర్యావరణంలో అత్యంత వేగంగా జరుగుతున్న ఈ జీవన విధ్వంసానికి మానవుడే కారణం. ఈ పరిస్థితిని చూసి జయరాజు కలత చెందుతాడు. ఆయన దర్శించిన జీవన విధ్వంసానికి మన కళ్లకు పటం కడుతూ ఇలా అంటాడు ‘ మానవ ప్రగతికి మూల కేంద్రాలుగా విలసిల్లిన నదులు మురికి కాలువలయ్యాయి. అవి వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయి. నదిపై ఆధారపడిన జలచరాలు కనుమరుగై పోయాయి. పశుపక్ష్యాదులు కాలగర్భంలో కలిసిపోయాయి. మబ్బులు సైతం ఆమ్లవర్షాలు, విషపు వర్షాలు కురిపిస్తున్నాయి. ఇలాగే కళ్లు నెత్తికెక్కిన చందంగా వ్యవహారిస్తే రేపు మనిషి కార్చే కన్నీళ్లలో కూడా విషమే వర్షిస్తుంది అంటాడు.

సమస్త జీవుల జీవనానికి కావాల్సిన అన్ని అవసరాలను ప్రకృతి అందిస్తుంది. ప్రకృతితో పాటు మానవ పరిణామక్రమంలో సమిధలైన వేలాది జీవుల త్యాగాన్ని ఆయన గుర్తిస్తాడు, కీర్తిస్తాడు. మానవులు కూడా ప్రకృతిలోని త్యాగ గుణాన్ని గుర్తించి, దానిని అలవరుచుకోవాలని హితవు పలుకుతూ ఇలా అంటాడు. ‘ ఏమాశించి పారే ఏరు.. పంట పొలాలకు ఉరికింది.. ఏమాశించి పచ్చని చేను.. పట్టెడు మెతుకులు పెడుతుంది అంటాడు. మానవజాతికి అమృతం వంటి ఔషద గుణాలు కలిగిన తేనేను అందించిన తేనేటీగల శ్రమని కీర్తిస్తూనే ‘ తేనేటీగలను చూడగలమే కాని, తేనేటీగలను సృష్టించగలమా.. అది ప్రకృతికే సాధ్యం అంటాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలనని విర్రవీగే మనిషికి గుప్పెడు మట్టిని పుట్టించటం చేతకాదు. ఆ విషయాన్ని ఆధునిక మానవుడు గుర్తించాలని కోరుతాడు. అభివృద్ధి అనే స్వార్ధం పొరలు కమ్మేసిన ఆధునిక మానవుడు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మానవ జాతి విధ్వంసం తప్పదని హెచ్చరిస్తాడు. మనుగడ సాధించాలంటే పద్ధతి మార్చుకోమని హితవు పలుకుతాడు. భూమ్మీద బతకటమంటే అది ఒక యుద్ధమే. పొంచి ఉన్న అనేకానేక శత్రువుల నుండి రక్షించుకోడానికి ప్రతి జీవి నిరంతరం తనను తాను సాయుధీకరించుకోవటమే జీవితం. పుట్టుకతోనే ఘర్షణ ప్రారంభమవుతుంది. జీవావరణ శాస్త్ర సిద్ధాంతంలో దీనినే జీవుల మధ్య సంఘర్షణ అని,

ఈ ఘర్షణలో విజయం సాధించిన జీవులే మనుగడ సాగిస్తాయని డార్విన్ అంటాడు. ఈ ఘర్షణలో తనను తాను రక్షించుకోడానికి ప్రకృతే జీవులకు కొన్ని ప్రత్యేక రక్షణలను అందిస్తుంది. జీవులకు ప్రకృతి అందించిన రక్షణ గురించి వివరిస్తూ జయరాజు ‘లేడి ప్రసవించగానే ఆ మైల వాసన చుట్టూ ఆరు మైళ్ల దూరం వరకూ వస్తుందట. అది గమనించిన పులులు, సింహాలు వచ్చే లోపు బిడ్డకు శత్రువు నుండి తప్పించుకునే తల్లి బిడ్డకు అన్ని విద్యలూ నేర్పాలి. సరిగ్గా ఇటువంటి అదును కోసమే పులులు ఎదురుచూస్తాయి. అందుకే పుట్టిన వెంటనే తల్లి తన పిల్ల ఒంటికి అంటిన మైలనంతా నాకి వేస్తుంది’ అంటాడు. విశ్వవిద్యాలయాలకు సైతం అందని అద్భుతమైన పరిశీలన ఇది. ప్రకృతిలోని నిర్మాణ వైచిత్రిని మనకు పరిచయం చేస్తూ ‘ప్రకృతి పులికి వేటాడే తెలివితేటలు ఇచ్చినట్లే లేడికి తప్పించుకునే నేర్పునూ ఇచ్చింది. పులికి మెత్తని పాదాలను ఇచ్చి, లేడికి రాళ్లల్లో, ముళ్లల్లో దాటిపోయే గట్టి డెక్కల నిచ్చింది’ అంటాడు. ఎంతో నిశితమైన దృష్టి ఉంటే కాని ఈ అంశాలను విశదీకరించే అవకాశముండదు.

పెరుగుతున్న కాలుష్యం బారిన పడి వేలాది జీవులు అత్యంత వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ జీవ వైవిధ్య విధ్వంసాన్ని నివారించకపోతే భవిష్యత్ తరాల జీవన చిత్రం మరింత చిందరవందరగా మారే ప్రమాదముంది. మానవుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి తన తప్పిదాలను సరిదిద్దుకోకపోతే ఆగ్రహించిన ప్రకృతి చేతిలో మానవుడి పరాజితుడిగా నిలవక తప్పదు. అదే రానున్న ఆరవ మహాప్రళయం. గతంలో సంభవించిన మహాప్రళయాల్లో డైనోసార్ వంటి జీవులు శాశ్వతంగా భూమ్మీద అంతరించి పోయాయి. భవిష్యత్తులో సంభవించే ఆరవ మహాప్రళయంలో అంతరించి పోయే జాతి మానవుడే. దీన్నుండి తప్పించుకోవాలంటే మానవుడు ప్రకృతి నియమాలకు లోబడి జీవించాలి. తోటి జీవరాశులతో తెగిపోయిన పేగుబంధాన్ని తిరిగి నిర్మించుకోవాలి. ‘ మనతోటి జీవరాశులతో ఆత్మీయమైన ప్రేమతో బతికిన జీవితమే సంపూర్ణం’ అంటాడు జయరాజు. ముందే చెప్పినట్టు జయరాజు సాహిత్యానిది ప్రకృతి తత్వం. ఆయన సాహిత్యంలో వెన్నెల విరుపు, మిణుగురుల మెరుపు, నెమలీకల వర్ణశోభతోపాటు, గుళ్లబారిన నత్త జీవితం, జీవన సారాన్ని కోల్పోయిన మట్టి పరిమళాలు అన్ని కలగలిపి ఉంటాయి. అందుకే ఆయన సాహిత్యమంతా ఒకటే పసరు వాసన.

ఆధునిక మానవుని అనాలోచిత చర్యల వల్ల పుడమితల్లి పడుతున్న పుట్టెడు కష్టాలను విప్పి చెప్పటమే కాదు, ప్రకృతిలోని అరుదైన, అద్భుతమైన జీవన దృశ్యాల్ని తన పాటల కాన్వాస్‌పై అందంగా చిత్రీకరిస్తాడు. ఆయన సృష్టిలోని అతి సూక్ష్మమైన రహస్యాలను వినగలుగుతాడు, కంటికి కనిపించని అద్భుతాలను దర్శించగలుగుతాడు. జయరాజుకి మానవుడే గీతం.. ప్రకృతే సంగీతం. ఆయన సాహిత్యం రానున్న రోజుల్లో దేశంలో జరిగే పర్యావరణ ఉద్యమాలకు కావాల్సిన తాత్విక, సైద్ధాంతిక పునాదులను అందిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కాలం చెక్కిలిపై ప్రకృతి చెక్కిన ఆకుపచ్చని సంతకం జయరాజు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News