రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులను తిరిగి వర్సిటీకి చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొనుంది. ఒకటి రెండు రోజుల్లో ఆమెకు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సభర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో వర్సిటీ నుంచి తీసుకున్నారు. రూల్స్‌నకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్నటువంటి టీఎస్ 08 ఈసీ 6345 వాహనం నాన్ టాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు. ప్రైవేటు వ్యక్తిగత వెహికల్ పవన్‌కుమార్ అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో వెల్లడైంది.
సీఎంవో స్మితా సభర్వాల్ ఆఫీస్ నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో విశ్వవిద్యాలయ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పనితీరుపై ఇటీవల ఎజి జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం కూడా ఉంది. ఈ విషయంపై వివరణ కోరగా స్మితా సభర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య అన్నారు. ఎజి ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ(ఇంటర్నల్ ఆడిట్), విశ్లేషణ జరిపించామని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ పాలకవర్గం దృష్టికి తీసుకురావడం ద్వారా సమావేశంలో కూడా విస్తృతంగా చర్చించామని, ఈ విషయంపై సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, న్యాయనిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ వర్సిటీ విసి వెల్లడించారు.