జయశంకర్ భూపాలపల్లి: మంత్రాల నేపంతో ఓ వృద్ధురాలిని హత్య చేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. టేకుమట్ల మండలం గర్మిళపల్లి ప్రాంతం బోయినపల్లి గ్రామానికి చెందిన సోరుపాక వీరమ్మ(70) చింతపండు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. గత బుధవారం గర్మిళ్లపల్లి గ్రామానికి వెళ్లిన వీరమ్మ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె శవం గర్మిళ్లపల్లి గ్రామ శివారులోని ఓ బావిలో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ క్రమంలో బోయినపల్లి గ్రామానికి చెందిన బోయిని ఎల్లయ్య, పుట్టకొక్కుల శ్రీనివాస్, గర్మిళ్లపల్లికి చెందిన సిద్ధూ పోలీసులు ఎదుట లొంగిపోయారు. తామే వీరమ్మను చంపానని ఒప్పుకున్నారు. వృద్ధురాలు తన కూతురుపై మంత్రాలు చేయడంతో అనారోగ్యం పాలు అవుతుందని బోయిని మల్లయ్య తెలిపారు. ఆ వృద్ధురాలిని చంపేస్తే తన కూతురు ఆరోగ్యంగా ఉంటుందని మల్లయ్య భావించాడు. దీంతో గత రెండు నెలల నుంచి వీరమ్మ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత బుధవారం ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలును పొదల్లొకి లాక్కెళ్లి చంపేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న రెండు తులాలు బంగారు ఆభరణాలు, 30 తులాల వెండికడియాలు తీసుకున్నారు. మృతదేహాన్ని బావిలో పడేసి వెళ్లిపోయారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డిఎస్‌పి సంపత్‌రావు తెలిపారు.