ఆయన కలను ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేరుస్తున్నారు
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ కలను ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేరుస్తున్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఆదివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి మంత్రి కెటిఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్ అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన తెలిపారు. భూపాలపల్లి జిల్లా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరుపెట్టుకొని గౌరవించుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు. జయశంకర్ ప్రస్తుతం బ్రతికి ఉంటే పదేళ్ల తెలంగాణ ప్రస్థానం చూసి చాలా సంతోష పడేవారని, గర్వపడేవారని ఆయన పేర్కొన్నారు.
ఇడ్లీ, సాంబార్ పోరాటం మొదలు తన శిష్యులు కెసిఆర్ తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నారని.. కెసిఆర్‌ను చూసి పుత్రోత్సాహంతో గర్వ పడేవారని కెటిఆర్ తెలిపారు. జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలను జయశంకర్ చూశారని, ఎప్పుడూ సిఎం కెసిఆర్‌కు వెన్నుదన్ని ప్రోత్సాహం అందించారని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం జయశంకర్ లేని లోటు తెలంగాణకు తీరలేనిదని ఎప్పుడూ సిఎం కెసిఆర్ అంటుంటారని కెటిఆర్ పేర్కొన్నారు. జయశంకర్ యాదిలో అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల తరపున ఆయన్ను స్మరించుకుంటున్నామన్నారు.