మన తెలంగాణ/సిటీ బ్యూరో: స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్నే త్యాగం చేసి, ప్రజల్లో ఉద్యమ భావజాల వ్యాప్తిని రగించిలిన మహనీయులు ప్రొఫెసర్ జయ శంకర్ అని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా శుక్రవారం మేయర్ తన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ….. జయశంకర్ సార్ ఆశయ సాధనలో భాగంగా సాధించకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన త్యాగపూరిత సేవలను స్మరిస్తూ ఆయన ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొటిగా నేరవేరుస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించిన 7 ఏళ్ల కాలంలో సాగు నీరు, వ్యవసాయం వంటి పలు రంగాల్లో విశేష కృషి సాధించామని పేర్కొన్నారు. అదేవిధంగా నగర పౌరులకు మెరుగైన సేవలనుఅందించడానికి జిమెచ్ఎంసి ఎప్పుడు ముందు వరసలో ఉంటుందని మేయర్ వెల్లడించారు. తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న బంగారు తెలంగాణ తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.