Monday, December 23, 2024

లొంగిపోయిన ఒరేవా గ్రూప్ ఎండీ… జ్యుడిషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని మోర్బీ జిల్లా మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరేవా  గ్రూపునకు చెందిన అజంతా మాన్యుఫ్యాక్టరింగ్ ప్రైవేట్ లిమిటెడ్  మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్ మంగళవారంనాడు కోర్టు ముందు లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనను కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. పటేల్‌పై గుజరాత్ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఆయన కోర్టుకు లొంగిపోయారు. వంతెన కుప్పకూలినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. దీంతో ఆయనపై కోర్టు ఇటీవల అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎం.జె. ఖాన్ ముందు పటేల్ లొంగిపోయినట్టు బాధితుల తరఫు వాదిస్తున్న న్యాయవాది దిలీప్ తెలిపారు. అక్టోబర్ 30న మోర్బీ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో 135 మంది మృతి చెందారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఉన్న సమయంలో వంతెన కూలిన ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మచ్చు నదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు తిరిగి ప్రారంభించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలు ఓరేవా గ్రూప్ తీసుకుంది. ఎలాంటి గత అనుభవం లేని ఓరేవా గ్రూపునకు గుజరాత్ ప్రభుత్వం అప్పగించడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందనే విమర్శలు చెలరేగాయి. వంతెనపైకి వెళ్లే వ్యక్తుల సంఖ్యపై పరిమితి లేకపోవడం, టిక్కెట్ల అమ్మకాలపై నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతోనే వంతెన కూలిపోయినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ఛార్జిషీటులో పేర్కొంది. నిపుణులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే మరమ్మతులు చేయడం వంటి లోపాలను సైతం ఎత్తిచూపింది. ఈ కేసులో ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిలు కోరుతూ జైసుఖ్ పటేల్ ఈనెల 20న మోర్బీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

 

Morbi bridge collapse

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News