మన తెలంగాణ/హై-దరాబాద్: 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో కెసిఆర్‌కు యువత నుండి మంచి సానుకూలత దక్కే అవకాశం ఉందని మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు. బుధవారం నాడు హైదరాబాద్‌లో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బుధవారం అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో కొత్తగా 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనపై జెసి దివాకర్‌రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఉద్యోగ ప్రకటన చేయలేదన్నారు. ఎపి రాష్ట్రానికి ఒకటి కాదు పది రాజధానులు పెట్టుకోవడమనేది సిఎం జగన్ ఇష్టమన్నారు.
మళ్లీ హైదరాబాద్‌కు రావాలని బొత్స సత్యనారాయణ అనుకొంటున్నారని జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు. మంత్రి బొత్స ప్రకటన చూస్తే మూడు రాజధానుల అంశాన్ని సిఎం జగన్‌కి వదిలేసినట్లే కనిపిస్తుందన్నారు. తమకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉందన్నారు. ఎపి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగినట్లుగా చెప్పారు. అయితే అపాయింట్‌మెంట్ ఇంకా దొరకలేదన్నారు. సిఎంలను కలవాలంటే గతంలో మాదిరిగా పరిస్థితులు లేవన్నారు. ఎపిలో మంత్రులకే సిఎం అపాయింట్‌మెంట్ లేదని దివాకర్‌రెడ్డి విమర్శించారు.