Sunday, December 22, 2024

అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ
ఉషా చిలుకూరికి విశాఖ వాసులతో బంధుత్వం
ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస
హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దానితో రెండవ సారి అగ్రరాజ్యం అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తమ ఉపాధ్యక్షునిగా జేడీ వాన్స్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఇక తాజాగా విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు కూడా. అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు. ఆయన భార్య ఉష తెలుగు సంతతికి చెందినవారు. ఉషా చిలుకూరి విశాఖపట్నం వాసులకు బంధువు అవుతారు.

నిరుటి వరకు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పని చేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. దీనితో ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కానున్నారు. 90 ఏళ్ల వయస్సులోను విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస అవుతారు. తెలుగు ప్రొఫెసర్‌గా పని చేసిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్ని సంవత్సరాల క్రితం కాలం చేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తే ఉషా చిలుకూరి. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరిగిన నేపథ్యంలో అంతగా పరిచయం లేదని శాంతమ్మ తెలిపారు. వాన్స్ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిసిన తరువాత పలువురు ఫోన్ చేసి అభినందించినట్లు శాంతమ్మ చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షునిగా జేడీ వాన్స్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ మార్మోగిపోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News