బెంగళూరు: జనతాదల్ (సెక్యూలర్) పార్టీ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి శనివారం అలసట, సాధారణ బలహీనత లక్షణాల కారణంగా మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 22 సాయంత్రం బెంగళూరు పాత విమానాశ్రయం రోడ్డులో ఉన్న ఆసుపత్రికి కుమారస్వామిని తరలించారు. డాక్టర్ సత్యనారాయణ మైసూర్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. సంబంధిత వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.
కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, తన ఆరోగ్యంపై పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాకు కుమార స్వామి పంపిన సందేశంలో పేర్కొన్నారు. పార్టీ పంచరత్న యాత్రలో బ్రేక్ లేకుండా విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన బాగా అలసిపోయారు. డాక్టర్లు ఆయనను కాస్త విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగనున్నది.